CPI to Showcase Communist Power: ఖమ్మం సభతో కమ్యూనిస్టుల సత్తా చాటుతాం
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:54 AM
దేశంలో కమ్యూనిజం ఎక్కడ అని ప్రశ్నించే వారికి ఖమ్మం బహిరంగ సభ ద్వారా తమ సత్తా చాటుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
18న 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): దేశంలో కమ్యూనిజం ఎక్కడ అని ప్రశ్నించే వారికి ఖమ్మం బహిరంగ సభ ద్వారా తమ సత్తా చాటుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 18న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో 5 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు ఏపీ నుంచి 50 వేల మంది, తమిళనాడు నుంచి పది వేల మంది, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు శ్రేణులు తరలివస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సుమారు 40 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. సుమారు పది వేల మందితో జన సేవాదళ్ కవాతు కూడా నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్‌లో శనివారం విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో కూనంనేని మాట్లాడారు. ఖమ్మం సభ అనంతరం 19న జాతీయ సదస్సు, 20, 21వ తేదీల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయని ఆయన వివరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి భిన్నంగా మారుతున్న పద్ధతులు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నామని తెలిపారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఆపరేషన్ కగార్, లేబర్ కోడ్‌ల వంటి సందర్భాల్లో కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
సమస్య వస్తే కమ్యూనిస్టులే గుర్తుకొస్తారు
సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రజలకు నేటికీ కమ్యూనిస్టులే గుర్తుకు వస్తారని అన్నారు. తాము నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఖమ్మం సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తారని చెప్పారు. జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడుతూ.. వందేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడామని, మౌలిక అంశాలను సాధించామని తెలిపారు. తాము అధికారంలోకి రాకపోయినా దేశ సమైఖ్యతకు విఘాతం కలగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడామన్నారు.