Share News

వామపక్ష లౌకిక శక్తులతో కలిసి పోటీ

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:24 AM

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులతో కలిసి కలసి పోటీ చేస్తామని సీపీఐ...

వామపక్ష లౌకిక శక్తులతో కలిసి పోటీ

  • త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం

  • సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

  • ఖమ్మంలో ముగిసిన జాతీయ కార్యవర్గ కౌన్సిల్‌ సమావేశాలు

ఖమ్మం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులతో కలిసి కలసి పోటీ చేస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. కేరళలో మరోసారి గెలిచి వామపక్ష ప్రభుత్వాన్ని సుస్థిరం చేయనున్నామని, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి.. వామపక్ష పార్టీల బలాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 18న భారీ బహిరంగ సభ నిర్వహించగా 19నుంచి బుధవారం వరకు జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించారు. బుధవారం కౌన్సిల్‌ సమావేశాల ముగింపు అనంతరం డి.రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలు అడ్డుకొనేందుకు అన్ని ప్రజాస్వామ్య లౌకిక శక్తులను ఏకం చేసి పోరాటాలు సాగించాలని నిర్ణయించామని తెలిపారు. శతాబ్ది ఉత్సవ వేడుకల స్ఫూర్తితో ప్రజాస్వామ్య ఉద్యమాలు చేపడతామని, వామపక్ష ఉద్యమాలకు ఆంద్రా, తెలంగాణ రాష్ట్రాలు కంచుకోట లాంటివని, ఈప్రాంతాలకు చెందిన చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య లాంటి నేతలు వారసత్వం కొనసాగిస్తామన్నారు. రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్‌ను ఆదేశించే హక్కు అమెరికాకు లేదన్నారు.పాలస్థీనా శతాబ్ది ఉత్సవాలు ఖమ్మంలో విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఖమ్మంలో సప్తపది ఫంక్షన్‌హాల్‌ వద్ద ఎర్రబెలూన్లకు సీపీఐ జెండా కట్టి జాతీయ ప్రదాన కార్యదర్శి రాజాతోపాటు రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఇతర నాయకులు ఆకాశంలోకి బెలూన్లు వదిలి ఉత్సవాలు ముగిసినట్టు ప్రకటించారు. కాగా సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమవేశాల్లో తొమ్మింది తీర్మానాలు ఆమోదించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానించారు. మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దుచేసి ఆస్థానంలో మరోపేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టడాన్ని నేషనల్‌ కౌన్సిల్‌ ఖండించింది.

Updated Date - Jan 22 , 2026 | 05:24 AM