Share News

పద్ధతి మారకపోతే కాంగ్రెస్‌తో పొత్తుకు ‘గుడ్‌బై’

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:35 AM

కాంగ్రెస్‌ పార్టీ తన పద్ధతి మార్చుకోకపోతే.. ఆ పార్టీతో సాగుతున్న పొత్తును తెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు

పద్ధతి మారకపోతే కాంగ్రెస్‌తో పొత్తుకు ‘గుడ్‌బై’

  • మిత్రధర్మం పాటించడం లేదు

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ తన పద్ధతి మార్చుకోకపోతే.. ఆ పార్టీతో సాగుతున్న పొత్తును తెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సమితి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని, కాంగ్రెస్‌ మిత్రధర్మం పాటించట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తగూడెం ఎపిసోడ్‌తో సీపీఐ- కాంగ్రెస్‌ మధ్య గ్యాప్‌ వచ్చిందని చెప్పారు. తమతో మిత్రధర్మం పాటించే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి తేల్చుకుంటామని చెప్పారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఒంటరిగా పోటీకి సిద్ధమవుతున్నామన్నారు. కాగా రైతుబంధుకు సంబంధించి ఇప్పటికే ఒక దఫా పెండింగ్‌లో ఉండగా, రెండవ దఫాకి కూడా సమయం మించిపోయిందన్నారు.

ప్రభుత్వం అసలు రైతుబంధు వేస్తుందా.. వేయదా స్పష్టం చేయాలని సాంబశివరావు డిమాండ్‌ చేశా రు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని భూదాన బాధితులకు, హైదరాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మార్చి 24న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణిని నష్టాల్లోకి నెట్టివేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు అధికార యూనియన్‌ ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు బస్సు యాత్ర చేపట్టనుందని, దానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు చేస్తున్న యు ద్ధాన్ని ప్రధాని మోదీ ఖండించాలని కూనంనేని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులకు సీపీఐ పూర్తిగా వ్యతిరేకమని కూనంనేని స్పష్టం చేశారు.

ప్రజా ఉద్యమాల్లో సీపీఐ ముందుండాలి: నారాయణ

ప్రజాసమస్యల పరిష్కారం కోసం సాగే పోరాటాల్లో సీపీఐ ఎప్పుడూ ముందుండాలని, అవసరమైతే జైళ్లకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ సెంట్రల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె. నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రజా ఉద్యమాలను ఉదహరించారు.

Updated Date - Mar 12 , 2026 | 09:19 AM