పథకాలు అందిస్తున్నా.. ప్రజల్లో ఏదో అసంతృప్తి : కూనంనేని
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:39 AM
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏదో తెలియని అసంతృప్తి కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్/కవాడిగూడ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ ప్రజల్లో ఏదో తెలియని అసంతృప్తి కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పేదలకు సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందట్లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా గవర్నర్ తన ప్రసంగంలో ప్రకటన చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రజాస్వామ్య పాలనలో గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని, ఇంకా బ్రిటీ్‌షకాలం నాటి రాజరిక పోకడలను అనుసరించడం సరికాదని స్పష్టం చేశారు. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సాగునీరు అందక, చేతికి వచ్చిన పంటలు రైతుల కళ్లెదుటే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల వెట్టి చాకిరీ ఆపాలి
మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందని కూనంనేని విమర్శించారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి కార్మికురాలికి రూ.10 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రూ. 3వేల వేతనంతో కుటుంబాలను పోషించలేక మహిళా కార్మికులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కూనంనేని హామీ ఇచ్చారు. పనికి తగిన వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.