Share News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కండి

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:52 AM

ప్రజా సమస్యల పరిష్కారానికై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కండి

  • రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో పార్టీ శ్రేణులకు కూనంనేని పిలుపు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్ర జ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. రాజీలేని పోరాటాల ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, రాబోయే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను కదిలించే శక్తి వామపక్ష పార్టీలకే ఉందన్నారు. మతపరమైన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి దక్షిణాదిలో తావు లేదని, తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమని తెలిపారు. కేరళలో మూడో దఫా కొద్దిపాటి తేడాతో గెలవలేకపోయామన్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీకి లభిస్తున్న మద్దతు ప్రజలకు ప్రభుత్వాలపై ఉన్న అసంతృప్తికి అద్దం పడుతోందని చెప్పారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ అసంతృప్తి బడబాగ్నిగా మారడానికి సీపీఐ వేదిక కావాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, బీఆర్‌ఎస్‌ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌కు సీపీఐ మిత్రపక్షం అయినందునే ఉద్యమాలు చేయలేకపోతున్నామనే భావనను తొలగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 5 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా పోటీ చేయాల్సిందేనని, పొత్తు కుదరకపోతే 10-15 స్థానాల్లో పోటీ చేద్దామని పేర్కొన్నారు. అనంతరం పార్టీ పోరాట కార్యక్రమాల షెడ్యూల్‌ విడుదల చేశారు.

Updated Date - Jun 02 , 2026 | 04:52 AM