Share News

పనికి మాలిన తీర్పులిస్తున్న న్యాయవ్యవస్థ

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:29 AM

ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ పనికి మాలిన తీర్పులు వెలువరిస్తోందని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పనికి మాలిన తీర్పులిస్తున్న న్యాయవ్యవస్థ

  • 12 మందిని చంపించిన అమిత్‌షా..ఇప్పుడు కేంద్ర హోంమంత్రి

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌.. ఒక్కటే: నారాయణ

  • మెదక్‌ జిల్లాకు గద్దర్‌ పేరు పెట్టాలి: జాజుల

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : ఇటీవలి కాలంలో మన న్యాయ వ్యవస్థ పనికి మాలిన తీర్పులు వెలువరిస్తోందని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని, వివాహితుడు మరొక మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని తీర్పులు ఇవ్వడం.. న్యాయవ్యవస్థ వింత పోకడలకు నిదర్శనమని విమర్శించారు. హత్యానేరం నుంచి బయట పడడానికి అమిత్‌ షా 12 మందిని చంపించాడని, ఖర్మ కొద్దీ ఆయనే ఇప్పుడు కేంద్ర హోం మంత్రిగా ఉన్నారని దుయ్యబట్టారు. గద్దర్‌ పై కాల్పులు జరిగిన రోజు(1997 ఏప్రిల్‌ 6)ను పురస్కరించుకుని సోమవారం బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్‌ పోరాట జీవితంపై సామా మల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘‘ప్రశ్నించే గొంతులు - సాధించిన విజయాలు’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా గద్దర్‌ మీద కాల్పులు జరిపిన వారిని మాత్రం పట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరైనా.. పాలక వర్గమంతా ఒక్కటేనని దుయ్యబట్టారు. మాజీ నక్సలైట్లతోపాటు ఎర్రజెండాను నమ్ముకున్న వారంతా ఒక గొడుగు కిందకు రావాలని నారాయణ ఆకాంక్షించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ మాట్లాడుతూ గద్దర్‌ ను స్మరించుకోవడం అంటే శ్రామిక వర్గాల విముక్తి పోరాటాన్ని బలపరచడమే అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం నెక్లెస్‌ రోడ్డులో గద్దర్‌ కళా క్షేత్రం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. మెదక్‌ జిల్లాకు గద్దర్‌ పేరు పెట్టాలని బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ గద్దర్‌ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలను, ముఖ్యంగా సమానత్వపు హక్కును జీవితంలో ఆచరణలోకి తేవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గద్దర్‌ పాటలపై విశ్వవిద్యాలయాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని కవి కోయి కోటేశ్వరరావు అభిలషించారు.

Updated Date - Apr 07 , 2026 | 05:29 AM