Share News

కొత్తగూడెం పీఠం సీపీఐదే!?

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:57 AM

కొత్తగూడెంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కార్పొరేషన్‌గా మారిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.

కొత్తగూడెం పీఠం సీపీఐదే!?

  • 60 డివిజన్లలో 22 దక్కించుకున్న పార్టీ

  • ఎన్నికల ముందు డిప్యూటీ మేయర్‌ పదవి కావాలని డిమాండ్‌.. అంగీకరించని కాంగ్రెస్‌

  • పొత్తు కుదరక సొంతంగా బరిలో దిగిన సీపీఐ

  • ఇప్పుడు మేయర్‌ పీఠం దక్కించుకునే చాన్స్‌!

  • సీపీఐకి మద్దతు ఇస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్‌

  • స్వంతంత్రుల్లోనూ ముగ్గురు సీపీఐ వైపే మొగ్గు!

హైదరాబాద్‌/కొత్తగూడెం, ఫిబ్రవరి 13 (ఆంధ్ర జ్యోతి): కొత్తగూడెంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కార్పొరేషన్‌గా మారిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. రాష్ట్ర స్థాయిలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌, సీపీఐ పార్టీలు ప్రత్యర్థులుగా తలపడడం.. ఇరు పార్టీలకూ సమాన సీట్లు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంది. కానీ, ఇక్కడ కాంగ్రెస్‌, సీపీఐలు 22 చొప్పున డివిజన్లు గెలుచుకోవడంతో హంగ్‌ ఏర్పడింది. మేయర్‌ పదవి ఎవరు దక్కించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ 22, సీపీఐ 22 డివిజన్లు దక్కించుకోగా.. బీఆర్‌ఎస్‌ 8, స్వతంత్రులు 6, బీజేపీ 1, సీపీఎం 1 డివిజన్లలో గెలుపొందాయి. ఈ క్రమంలో సీపీఐకి మద్దతిస్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. స్వతంత్రులుగా గెలిచిన ఆరుగురిలో ముగ్గురు సీపీఐకి మద్దతు ఇస్తామని ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన సీపీఐకి బీఆర్‌ఎస్‌ మద్దతిస్తే 30 డివిజన్లు అవుతాయి. ముగ్గురు స్వతంత్రుల మద్దతు లభిస్తే 33 డివిజన్లు సీపీఐ చేతిలో ఉంటాయి. అయితే ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్నందున.. బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై పార్టీ పెద్దలతో మాట్లాడి, స్థానిక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా స్వతంత్ర అభ్యర్థులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వాటితోపాటు ఇక్కడ నామినేటెడ్‌ ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ఏదేమైనా మేయర్‌ పీఠం దక్కాలంటే పార్టీలు శ్రమించాల్సిందే.


పొత్తు కుదరక.. ఫలితం తారుమారు

ఎన్నికలకు ముందు సీపీఐ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయాలనే చర్చలు జరిగాయి. పొత్తులో కనీసం 15 డివిజన్లు, డిప్యూటీ మేయర్‌ ఇవ్వాలని సీపీఐ నేతలు పట్టుబట్టారు. చివరి క్షణంలో పొత్తు విఫలమైంది. ఎవరికి వారే బరిలో దిగారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి కూడా సొంత జిల్లాలో పట్టు నిలుపుకొనేందుకు ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. గ్రూపు రాజకీయాలు, ఇతర కారణాలతో కాంగ్రెస్‌ చతికిలపడగా.. సీపీఐ మాత్రం అనూహ్య ఫలితాలు సాధించింది. డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకుంటామన్న సీపీఐ ఇప్పుడు మేయర్‌ స్థానాన్ని దక్కించుకునే పరిస్థితికి చేరింది.

సహకరిస్తామంటే వద్దని ఎలా అంటాం..?

సీపీఐకి మద్దతిచ్చేందుకు బీఆర్‌ఎస్‌ ముందుకు రావడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కేటీఆర్‌ సీపీఐకి మద్దతు ప్రకటించగా.. కూనంనేని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పాల్వంచలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 16న మేయర్‌ స్థానం సీపీఐకి దక్కబోతోందన్నారు. కేటీఆర్‌ తనకు ఫోన్‌ చేసిన మాట వాస్తవమేనని, వారితోపాటు స్వతంత్ర అభ్యర్థి దుర్గాప్రసాద్‌ మద్దతు ప్రకటించారని, ఇతర స్వతంత్రులు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్‌ డిప్యూటీ మేయర్‌ తీసుకుని మీకు మేయర్‌ ఇస్తామంటే అంగీకరిస్తారా? అని విలేకరులు అడగ్గా.. ‘కాంగ్రెస్‌ సహకరిస్తామంటే వద్దని ఎలా చెబుతాం?’ అని కూనంనేని అన్నారు. ఏదేమైనా మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటూ కాంగ్రెస్‌, సీపీఐలకు ఇతరుల మద్దతు తప్పనిసరిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ ఎన్నికల్లో సీపీఐకి అనుకూల ఫలితాలు రావడం శుభపరిణామమని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్సింహం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 03:57 AM