CPI Criticizes: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:07 AM
జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర పన్నుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు.
ఉపాధి హామీ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో డి.రాజా
ఖమ్మం, జనవరి 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర పన్నుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ఖమ్మంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ 4లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చిందని, దీన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న 10జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా జాతీయ కౌన్సిల్‌లో తీర్మానం చేశామన్నారు. మరోవైపు సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మంగళవారం ఖమ్మంలో 5కమ్యూనిస్టు పార్టీల జాతీయ స్థాయి సెమినార్ జరగనుంది. ‘నేటి భారతదేశం-వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె
మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాస్తోందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్ ఆరోపించారు. కార్మిక హక్కుల సాధనకు ఫిబ్రవరి 12న 10జాతీయ కార్మిక సంఘాలతో సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని చెప్పారు. సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్పవాల్లో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆమె సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో కార్మికులకు ఉద్యోగ భద్రత కనుమరుగవుతోందని, పెన్షన్, గ్రాట్యూటీ వంటి సౌకర్యాలు ఉండడం లేదన్నారు.