కొత్తగూడెంలో మా అభ్యర్థికి సీఐ తుపాకీ గురిపెట్టారు!
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:25 AM
కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ తమ పార్టీ అభ్యర్థిని ఓ సీఐ బెదిరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు
ఎర్రచొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు
ఇది ప్రజాస్వామ్యమా.. పోలీసు రాజ్యమా?:కూనంనేని
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ తమ పార్టీ అభ్యర్థిని ఓ సీఐ బెదిరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. తమ అభ్యర్థికి సీఐ తుపాకీ చూపి మరీ బెదిరించారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. మఖ్దూంభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థిని ఒక సీఐ తుపాకీతో బెదిరించడం గర్హనీయమన్నారు. ఎర్ర చొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇదేమన్నా పోలీసు రాజ్యమా? అని నిలదీశారు. కొత్తగూడెంలో పోలీసులు అరాచకంగా వ్యవహరించారన్నారు. ఎర్ర చొక్కా వేసుకుంటే విప్పించారని, క్యాతనపల్లిలో ఎర్రచొక్కా వేసుకున్న ఓటరును పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలని చెప్పుకొంటున్నా.. ఎన్నికలు వస్తే పొత్తులు కుదరడం లేదని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనైనా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని కాంగ్రె్‌సకు సూచించారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా సీపీఐ కార్పొరేటర్ ఎన్నికవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
యువకుడు, ఆటోడ్రైవర్ అయిన గణేశ్‌ను మేయర్ చేశామని కూనంనేని చెప్పారు. గతంలో సీపీఐకి 20 స్థానాలు ఉంటే ఈ ఎన్నికల్లో 41 సీట్లు గెలుచుకున్నామని కూనంనేని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో 75 స్థానాలు ఉంటే మొన్నటి ఎన్నికల్లో 101 స్థానాలు గెలిచామని వివరించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామని తెలిపారు. సీపీఐకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటించినప్పటికీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి ఉన్నందున ఆ పార్టీ మద్దతు తీసుకోలేకపోయామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమకు బలం ఉన్న చోట సీట్లు అడుగుతామని.. ఇవ్వకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచి, మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తుచేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని అందరూ విమర్శించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో వెళ్లకుండా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలని సూచించారు.