పేదల ఇండ్ల కోసం వామపక్షాల పోరుబాట
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:16 AM
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు, ఇండ్లస్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యుత్...
జూలై 6న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా: కూనంనేని
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, భూదాన్ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు, ఇండ్లస్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యమం తరహాలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.అందులో భాగంగా వామపక్ష పార్టీలతో కలిసి జూలై 1న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా జూలై 6న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద భారీ ఎత్తున మహా ధర్నా చేపడతామన్నారు. ఇండ్ల పట్టాలు, ఇండ్లు కావాల్సిన వారు దరఖాస్తులతో ఈ ధర్నాకు రావాలని పిలుపునిచ్చారు. పాశ మైలారం సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 54 మంది మరణించిన ఘటన జరిగి ఏడాది పూర్తయినా బాధితులకు పూర్తిస్థాయి పరిహారం అందకపోవడం దారుణమన్నారు. ప్రమాద బాధితులకు యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా రూ.కోటి చొప్పున పరిహారం తక్షణమే చెల్లించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.