Share News

సీపీగెట్‌లో 93.54శాతం మంది క్వాలిఫై

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:03 AM

రాష్ట్ర వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ కోర్సుల్లో (ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర).. ప్రవేశాల కోసం..

సీపీగెట్‌లో 93.54శాతం మంది క్వాలిఫై

  • ఫలితాల్లో మహిళా అభ్యర్థులదే పైచేయి

  • ఉత్తీర్ణుల్లో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

  • ఈ నెల మూడో వారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్‌

కేయూ క్యాంపస్‌ ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ కోర్సుల్లో (ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర).. ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్‌ -2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన ‘కామన్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌)’ ఫలితాలను.. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి, సీపీగెట్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.ప్రతా్‌పరెడ్డి, కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రం, సీపీగెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కట్ల రాజేందర్‌ విడుదల చేశారు. ఇందులో సాధించిన ర్యాంకుల ఆధారంగానే అభ్యర్థులకు ఉస్మానియా, కేయూ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, చాకలి అయిలమ్మ మహిళ వర్సిటీ, జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. మూడో వారం నుంచి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ (https://cpget.tgche.ac.in) నుంచి అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మహిళలే అధికం..

సీపీగెట్‌లో మహిళల హవానే నడిచింది. హాజరైన వారిలో 31,534 మంది మహిళలు కాగా, పురుషులు 13,925 మంది ఉన్నారు. ఫలితాల్లోనూ మహిళలే ముందున్నారు. 29,365 మంది మహిళలతోపాటు, 13,158 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులూ అర్హత సాదించారు. సీపీగెట్‌కు 52,697 మంది దరఖాస్తు చేసుకోగా.. 45,462మంది హాజరయ్యారు. 42,526 మంది అర్హత (93.54 శాతం) సాధించారు.

Updated Date - Aug 06 , 2026 | 06:05 AM