హైకోర్టు ఆదేశించినా పంపరా?
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:30 AM
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీజీశాక్స్) పరిధిలో జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కొద్ది నెలల క్రితం నిబంధనలకు...
మా బదిలీలు రద్దు చేయండి
టీజీశాక్స్ కాంట్రాక్టు ఉద్యోగుల మొర
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీజీశాక్స్) పరిధిలో జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కొద్ది నెలల క్రితం నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గినైజేషన్(న్యాకో) నిబంధనల ప్రకారం రాష్ట్రాల పరిధిలోని జిల్లాల్లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేయకూడదు. కానీ నాటి టీశాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న వాసం వెంకటేశ్వర్లు జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను బదిలీ చేశారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. న్యాకో నిబంధనలకు విరుద్ధంగా తమను బదిలీ చేశారని, తక్షణమే రూల్స్ ప్రకారం తమ తమ స్థానాల్లో కొనసాగించాలని కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిబంధనల మేరకు బదిలీలు చెల్లవని, తిరిగి వారిని ఎక్కడి నుంచి బదిలీ చేశారో అక్కడికి పంపాలని ఆదేశించింది. అయితే అలా రూల్స్‌కు వ్యతిరేకంగా బదిలీ అయిన వారందర్నీ తిరిగి వారి సొంత జిల్లాలకు పంపాలని హైకోర్టు ఆదేశించినా టీశాక్స్ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబరు నెలలో అప్పటి పీడీ తమను బదిలీ చేశారని, అది న్యాకో నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తిరిగి తమ సొంత ప్లేసులకు పంపాలని విజ్ఞప్తి చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తామంతా హైకోర్టును ఆశ్రయించామని వెల్లడించారు. హైకోర్టు తమను సొంత జిల్లాలకు పంపాలని టీశాక్స్ పీడీని ఆదేశించినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే టీశాక్ పీడీ హైకోర్టు ఆదేశాలను గౌరవించి గతంలో బదిలీ అయిన వారిని తిరిగి సొంత జిల్లాలకు పంపాలని విజ్ఞప్తి చేశారు.