రేవంత్ సర్కార్‌కు కౌంట్ డౌన్ షురూ
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:52 AM
సీఎం రేవంత్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ ఆరంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. 999 రోజుల్లో కాంగ్రెస్ పాలన ముగియబోతోందని...
కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు.. ప్రజాభక్ష పాలన: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ ఆరంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. 999 రోజుల్లో కాంగ్రెస్ పాలన ముగియబోతోందని, మహిళలే కాంగ్రెస్‌ను ఓడించబోతున్నారని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే సరిపోతుందా..? అని ప్రశ్నించారు. వారికి భద్రత ఏదని.. షీ టీంలు, భరోసా టీంలు ఏమయ్యాయని నిలదీశారు. మహిళలకు భద్రత కల్పించకపోవడమే ప్రజాపాలనా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలపై అత్యాచారాలు అత్యధికంగా జరుగుతున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ పేరు క్రైం రికార్డ్స్‌లో నమోదైందని విమర్శించారు. పేద మహిళల ఇళ్లు కూల్చివేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ప్రజాపాలన కాదు.. ప్రజా భక్ష పాలన అని మండిపడ్డారు. ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్‌కు అనుగుణంగా యువ మహిళలకు టిక్కెట్లు ఇస్తామని రాంచందర్‌రావు తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని సుష్మా స్వరాజ్ కుమార్తె, ఎంపీ బాంసురీ స్వరాజ్ పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ అసాధ్యమని అపాకపరు. ప్రధాని మోదీ, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళలు మానసికంగా దృఢంగా ఉండాలని పిలుపునిచ్చారు.