ఖాళీ సీట్ల కౌన్సెలింగ్‌కు అనుమతివ్వండి
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:46 AM
రాష్ట్రంలో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలంటూ తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
377 పీజీ మెడికల్ సీట్లపై
హైకోర్టులో కాలేజీల పిటిషన్
సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకువేచిచూస్తాం: హైకోర్టు
హైదరాబాద్, మార్చి13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మిగిలిపోయిన పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలంటూ తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 377 పీజీ మెడికల్ సీట్లు మిగిలిపోయాయని, ఈ సీట్లకు స్టే వెకెంట్ లేదా అదనపు రౌండ్ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలు, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ), మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని యాజమాన్యాల సంఘం కోరింది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. పీజీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే పర్సంటైల్ స్కోరు తగ్గింపు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున అక్కడ నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తామని పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసీ వివరణ సమర్పించాలని పేర్కొంటూ విచారణను 26కు వాయిదా వేసింది.
నిమ్స్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాల్సిందే: హైకోర్టు
నిమ్స్‌లో సెమీ స్కిల్డ్ వర్కర్స్‌గా పనిచేస్తున్న ఈశ్వర్ సింగ్, మరో 28 మంది సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు మరోసారి ఆదేశించింది. తీర్పును అమలు చేయకపోతే నిమ్స్ డైరెక్టర్ ఏప్రిల్ 10న హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొంది. గతంలో సింగిల్ జడ్జి ధర్మాసనంఈశ్వర్‌సింగ్ తదితరుల పిటిషన్లపై.. అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు సైతం పిటిషనర్ల సర్వీసు క్రమబద్ధీకరణను సమర్థించింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో పిటిషనర్లు తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది.