Share News

kumaram bheem asifabad- నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 10:14 PM

జిల్లాలో పత్తి కొనుగోళ్లను శనివారం నుంచి నిలిపివేస్తున్నారు. ఆరుగాలం కష్ట పడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో వర్షాభావం, తరువాత భారీ వర్షాలతో పత్తి పంటపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెగుళ్లు, చీడా పీడల బెడద కూడా ఈ సారి తీవ్రంగా ఉంది.

kumaram bheem asifabad- నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్‌
చేనులలో ఉన్న పత్తి పంట

పెంచికలపేట, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి కొనుగోళ్లను శనివారం నుంచి నిలిపివేస్తున్నారు. ఆరుగాలం కష్ట పడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు పత్తి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో వర్షాభావం, తరువాత భారీ వర్షాలతో పత్తి పంటపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెగుళ్లు, చీడా పీడల బెడద కూడా ఈ సారి తీవ్రంగా ఉంది. ఫలితంగా ఎకరాకు పది నుంచి 12 క్వింటాళ్ల దిగుబడికి బదులు ఐదు నుంచి ఆరు క్వింటాళ్లకు పడిపోయింది. దిగుబడి తగ్గి ఆందోళన చెందుతున్న రైతులకు ఇప్పుడు సీసీఐ పత్తి కొనుగోళ్లు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు. పెంచికలపేట మండల వ్యాప్తంగా 10,834 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. కానీ ఇప్పటి వరకు పత్తి ఏరివేత పూర్తి కాలేదు. సగానికి పైగా పత్తి చేనులోనే ఉంది. కూలీల కొరత ఏర్పడడంతో ఏ ఒక్క రైతు కూడా పూర్తి స్థాయిలో పత్తి ఏరివేత పూర్తి కాలేదు. దీనికి తోడు కూలి రేట్లే గతంతో పోలిస్తే అధికమయ్యాయి. పెంచికలపేటతో పాటు దహెగాం, చింతలమానేపల్లి, బెజ్జూరు, కాగజ్‌నగర్‌ తదితర మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సీసీఐ కొనుగోలు చేయకుంటే ఏరివేత దశలో ఉన్న పత్తి పంటను ఎక్కడ విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితి రైతుల్లో నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మరి కొన్ని రోజులు సీసీఐ కొనుగోళ్లు కొనసాగిస్తే పత్తి రైతులకు ఊరట కలుగుతుంది.

Updated Date - Feb 27 , 2026 | 10:14 PM