Share News

Telangana Excise Department: ఒక్కో మద్యం షాపు.. ఒక్కో రేటు!

ABN , Publish Date - Jan 12 , 2026 | 03:32 AM

రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్‌ శాఖలో అవినీతి ఏరులై పారుతోందా? డిసెంబరు ఒకటో తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుల మంజూరు...

Telangana Excise Department: ఒక్కో మద్యం షాపు.. ఒక్కో రేటు!

  • 1.75లక్షల నుంచి 2.50లక్షల దాకా వసూలు

  • కొత్త మద్యం షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోలు వసూళ్లు.. రూ.60 కోట్ల పైనే

  • జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని పెద్ద బాస్‌ల వరకు మామూళ్ల పంపకాలు

  • కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్‌ శాఖలో అవినీతి ఏరులై పారుతోందా? డిసెంబరు ఒకటో తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుల మంజూరు చేసే ప్రక్రియను అడ్డంపెట్టుకుని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా? డిమాండ్‌ను బట్టి షాపుకో రేటు.. అధికారికో వాటా అన్నట్లుగా వ్యవహారం సాగుతోందా? నిబంధనల పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి రూ.లక్షలు గుంజుతున్నారా? అంటే అవుననే అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్న వారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. గత ఏడాది డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నవంబరులో లాటరీ పద్ధతిన దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజినల్‌ లైసెన్సులు జారీ చేశారు. ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే.. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో దాదాపు 60 కోట్ల మేర వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఒక్కో షాపు లైసెన్స్‌ ఇవ్వడానికి బహిరంగంగానే రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. అమ్మకాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో షాపు నుంచి రూ.2.50లక్షలు డిమాండ్‌ చేస్తుండగా.. ఇతర జిల్లాల్లో రూ.1.75లక్షల దాకా వసూలు చేస్తున్నారు. గతం(2023-25)లో రూ.లక్ష నుంచి రూ.1.30లక్షలు తీసుకున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు.. ఇప్పుడు ఏకంగా రూ.1.75లక్షల నుంచి రూ.2.50లక్షలకు పెంచేశారని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. ఇన్‌స్పెక్టర్ల నుంచి మొదలై ఈఎస్‌, ఏసీ, డీసీల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ గొలుసు విస్తరించిందనే ఆరోపణలున్నాయి. వసూలైన మొత్తంలో దాదాపు 40శాతం నేరుగా హైదరాబాద్‌లోని ‘బాస్‌’లకు చేరుతోందని సమాచారం.


హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా..

  • హైదరాబాద్‌, రంగారెడ్డి-మేడ్చల్‌ జిల్లాలో ఒక్కో లైసెన్స్‌కు రూ.2.50 లక్షలపైగా వసూలు చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా (శేర్‌లింగంపల్లి- గచ్చిబౌలి బెల్ట్‌)లో ఒక ‘ఇన్‌స్పెక్టర్‌’ బాధితుడితో మాట్లాడుతూ.. ‘పైన కమిషనరేట్‌ స్థాయి వరకు వాటాలు వెళ్లాలి.. రెండున్నరకు తక్కువైతే పైలు ముందుకు కదలదు’ అని బెదిరిస్తున్న ఆడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వికారాబాద్‌ జిల్లాలో ఒక ఎక్సైజ్‌ అధికారి ఇంతకంటే తక్కువైతే కుదరదని తెగేసి చెప్పారు.

  • నిర్మల్‌లో ఓ మద్యం దుకాణం 30 పడకల ఆస్పత్రికి అతి సమీపంలో ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తొలుత అనుమతి ఇవ్వబోమని చెప్పిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు.. ఆ తర్వాత భారీగా డబ్బులు తీసుకుని అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో ఒక దుకాణాన్ని అదే మండలంలోని పొచ్చర క్రాస్‌ రోడ్డుకు మార్చుకోవడానికి భారీగా డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.

  • నల్లగొండ, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో మద్యం షాపులకు భారీ డిమాండ్‌ ఉంది. ‘బోర్డర్‌ ఏరియా అంటే రిస్క్‌ ఎక్కువ. అందుకే రూ.2.25లక్షలు ఫిక్స్‌’ అని అక్కడి అధికారులు తేల్చిచెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హైవేపై ఉన్న దుకాణాల నుంచి ఒక ఏఈఎస్‌ తన ప్రైవేట్‌ డ్రైవర్‌ ద్వారా డబ్బు వసూలు చేయిస్తున్నారు. ‘మామూళ్లు ఇస్తేనే ఎన్‌వోసీ వస్తుంది’ అని చెప్పిన మాటలు ఫోన్‌లో రికార్డయ్యాయి.


  • మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ హైవే బెల్ట్‌లో ఒక్కో షాపు నుంచి రూ.2లక్షలపైగా వసూలు చేసినట్లు చెబుతున్నారు.

  • కరీంనగర్‌, వరంగల్‌లో ‘ఫీల్డ్‌ వెరిఫికేషన్‌’ పేరుతో రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. ఒక సెక్షన్‌ క్లర్క్‌, దుకాణదారుడి మధ్య జరిగిన సంభాషణలో.. ‘జిల్లా బాస్‌ దగ్గరకు రేపు ఫైల్‌ వెళుతుంది. ఈలోపు సెటిల్‌ చేసుకోండి’ అని చెప్పడం గమనార్హం. వరంగల్‌ సమీప ప్రాంతానికి ఓ మద్యం వ్యాపారి.. సదరు అధికారి కారులోనే నగదు అందజేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

  • ‘నేను అన్ని నిబంధనల ప్రకారమే దరఖాస్తు చేసుకున్నాను. కానీ.. స్థానిక ఎక్సైజ్‌ అధికారి నా షాపు దగ్గర స్కూల్‌ ఉందని తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చారు. రూ.2లక్షలు ఇస్తామంటేనే ఆ రిపోర్ట్‌ మారుస్తానని, లేదంటే లైసెన్స్‌ రాదని మొహఖం మీదే చెప్పారు. ఆడియో రికార్డ్‌ చేశాను. డబ్బులు ఇచ్చాకే లైసెన్స్‌ ఇచ్చారు’ అని రంగారెడ్డి జిల్లాకు చెందిన బాధితుడు వేదన వ్యక్తం చేశారు.

  • ‘‘డబ్బులు ఇవ్వకుంటే రాబోయే రెండేళ్లలో ఏ సమస్యలు సృష్టిస్తారో అన్న ఆందోళనతో భారమైనా ఇచ్చుకుంటూ వస్తున్నాం’’అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వైన్‌షాపు యజమాని వాపోయారు.


ఏసీబీకీ అందిన కీలక ఆధారాలు

ఎక్సైజ్‌శాఖలో సాగుతున్న వసూళ్ల పర్వం వివరాలు అవినీతి నిరోధక శాఖకు అందినట్లు తెలిసింది. అధికారుల బెదిరింపులు భరించలేని కొందరు బాధితులు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం. లక్షల్లో నగదు తీసుకుంటున్న వీడియోలు, ఉన్నత అధికారుల పేర్లు చెప్పి బేరసారాలు సాగించిన ఆడియో క్లిప్పింగ్‌లు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ‘మాకు అందిన ఫిర్యాదుల మేరకు ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తున్నాం. అనినీతికి పాల్పడినవారిని వదిలే ప్రసక్తే లేదు’ అని ఏసీబీ అధికారి ఒకరు చెప్పారు.

Updated Date - Jan 12 , 2026 | 03:33 AM