సీఎంఎస్ కేంద్రాల్లో పోస్టింగ్‌ల దందా!
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:32 AM
రాష్ట్రంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల (సీఎంఎస్)లో ఫార్మసిస్టుల డిప్యూటేషన్లు వివాదాస్పదంగా మారాయి. నిబంధనలు పక్కనబెట్టి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పదవులు కట్టబెట్టడంపై వైద్యఆరోగ్య.....
అక్రమార్కులకు కీలక పదవులు
డిప్యూటేషన్ల వెనక చేతులు మారిన నగదు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల (సీఎంఎస్)లో ఫార్మసిస్టుల డిప్యూటేషన్లు వివాదాస్పదంగా మారాయి. నిబంధనలు పక్కనబెట్టి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పదవులు కట్టబెట్టడంపై వైద్యఆరోగ్య శాఖలో విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ఆరుగురు ఫార్మసిస్టులను సీఎంఎస్కు పంపడం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి వంటి కీలక పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పంపడం వెనక పెద్దఎత్తున నగదు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినట్లు వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారం వెనుక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన ఓ ఉద్యోగి డీహెచ్ కార్యాలయంలో చక్రం తిప్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జిల్లాల్లో ఉన్న సీఎంఎస్ స్టోర్లలో పనిజేసేందుకు ఫార్మసిస్టులు ఆసక్తి చూపడం లేదు. కానీ, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మాత్రం అందుకు విరుద్ధంగా లక్షలు పోసి మరీ డిప్యూటేషన్స్ తెచ్చుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆసుపత్రులకు మందుల సరఫరా, సర్జికల్ సామగ్రి సరఫరా ఈ జిల్లాల పరిధిలోని సీఎంఎస్ స్టోర్ల నుంచే జరుగుతుంది. ఇక్కడి ఫార్మసిస్టులపై ఫార్మసీ కంపెనీలు కూడా కాసుల వర్షం కురిపిస్తుంటాయి. అందుకే ఈ జిల్లాల్లో పోస్టింగ్ దక్కించుకోవడానికి పోటీపడతారు.
విజిలెన్స్ కేసులున్నా పట్టించుకోని వైనం
ఆయా జిల్లాల్లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్లలో ఖాళీలపై వచ్చిన ఖాళీల సమాచారం మేరకు, రాష్ట్రవ్యాప్తంగా 13 సీఎంఎ్‌సలకు.. 13 మంది ఫార్మసిస్టులకు డిప్యూటేషన్ ఉత్తర్వులను డీహెచ్ రవీంద్రనాయక్ 21న జారీ చేశారు. అయితే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ రెండు సీఎంఎస్ కేంద్రాలకు.. అవినీతి ఆరోపణలు, విజిలెన్స్ కేసులు ఎదుర్కొంటున్న ఇద్దరు ఫార్మసిస్టులను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఇందులో ఓ ఫార్మసిస్టు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎంఎస్ఐడీసీలో పనిచేసినపుడు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత అతడు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కీలక పోస్టింగ్ తెచ్చుకున్నాడు. అక్కడా అవకతవకలకు పాల్పడడంతో ఉద్యోగం నుంచి తప్పించారు. అలాంటి ఆరోపణలున్న వ్యక్తిని తాజాగా డీహెచ్ కార్యాలయం సీఎంఎస్ స్టోర్ ఇంచార్జిగా నియమించింది. ఇక, మరో ఫార్మసిస్ట్ హైదరాబాద్‌లోని ఓ సీఎంఎస్ స్టోర్‌లో పనిచేస్తూ కొవిడ్ సమయంలో లక్షలు వెనకేసుకున్నాడని సమాచారం. మందుల సరఫరాలో అంతరాయం కలగకూడదనే సాకుతో ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నప్పటికీ, తెరవెనుక మాత్రం వసూళ్ల పర్వం సాగినట్లు ఆరోపణలున్నాయి. కాగా ఉన్నతాధికారులు స్పందించి ఈ నియామకాలపై సమగ్ర విచారణ జరపాలనిసాధారణ ఫార్మసిస్టులు డిమాండ్ చేస్తున్నారు.