Share News

ఏజెన్సీ ప్రాంతాలపై కార్పొరేట్ల దాడి

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:11 AM

మైనింగ్‌ పేరుతో అటవీ సంపదను, ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండలు, గుట్టలను కార్పొరేట్‌ కంపెనీలు కొల్లగొడుతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

ఏజెన్సీ ప్రాంతాలపై కార్పొరేట్ల దాడి

  • మైనింగ్‌ పేరుతో కొండలను కొల్లగొడుతున్నారు

  • వారిని మనమంతా ఐక్యంగా అడ్డుకోవాలి

  • ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మైనింగ్‌ పేరుతో అటవీ సంపదను, ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండలు, గుట్టలను కార్పొరేట్‌ కంపెనీలు కొల్లగొడుతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులను అందరమూ కలిసికట్టుగా అడ్డుకుందామని, అందుకోసం ఎస్టీ సామాజిక వర్గ ప్రజలంతా ఏకం కావాల్సిన తరుణమిదని అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ఈ మేరకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఆదివాసీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు విక్రాంత్‌ భూరియా, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ.. అంబానీ, అదానీలకు అటవీ వనరులను దోచి పెడుతుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు అండగా ఉన్నాయని, ఈ వర్గాలకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణను కల్పించాయని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల పాలనలో ఎస్టీలకు తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలపైన దాడులు చేయడమే కాకుండా చట్టాలనూ ఉల్లంఘించారని, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే గిరిజన వర్గాల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చామని, ఇందులో భాగంగా ఐదుగరు ఎస్టీ నేతలను జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నియమించామని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులూ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన ఏకలవ్య, కొమురం భీం, సేవాలాల్‌ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ బలోపేతం కోసం తాలుకా వారిగా సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 05:11 AM