Controversy Over MANUU Land: ముదురుతున్న మనూ భూ వివాదం
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:22 AM
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) భూముల అంశం వివాదాస్పదమవుతోంది. వర్సిటీలో ఖాళీగా ఉన్న 50 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు పంపగా.. ఆ
50 ఎకరాల మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీ భూముల కోసం ప్రభుత్వ నోటీసు
ఆ భూముల్లో నిర్మాణ ప్రతిపాదనలున్నాయని రిజిస్ట్రార్ సమాధానం
ఆడిట్‌లో భాగంగానే నోటీసులు పంపామంటున్న అధికారులు
వర్సిటీ లిఖిత పూర్వక వివరణ ఇస్తే నోటీసు విరమించుకుంటామని కలెక్టర్ హామీ
హైదరాబాద్, జనవరి 7(ఆంధ్ర జ్యోతి): మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) భూముల అంశం వివాదాస్పదమవుతోంది. వర్సిటీలో ఖాళీగా ఉన్న 50 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు పంపగా.. ఆ భూముల్లో నిర్మాణ ప్రతిపాదనలున్నాయని.. రెండు నెలల్లో సమగ్ర వివరాలు అందిస్తామని వర్సిటీ ప్రభుత్వానికి చెప్పింది. అయితే, ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రాజకీయపక్షాలు, విద్యార్థి సంఘా లు చర్చకు తెరలేపగా రోజురోజుకి వివాదం ముదురుతోంది. గచ్చిబౌలి(గండిపేట మండలం మణికొండ జాగీర్ పరిధిలోని)లో ఉన్న మనూకు 1998లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సర్వే నం.211, 212 లోని 200 ఎకరాలను కేటాయించింది. 1998 జూలై 23న మనూ రిజిస్ర్టార్‌కు భూములు అప్పగించగా.. నాటి నుంచి అందులోని 150 ఎకరాలే వినియోగంలో ఉన్నాయి. దీంతో ఖాళీగా ఉన్న 50 ఎకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి 2025 డిసెంబరు 15న వర్సిటీ రిజిస్ట్రార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. 1975 నాటి ఎలినేషన్ ఆఫ్ స్టేట్ ల్యాండ్ నిబంధనల్లో 6వ నిబంధన ఉల్లంఘనగా.. కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉన్నందున వాటిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన వర్సిటీ రిజిస్ట్రార్.. ఆ 50 ఎకరాల్లో కొత్త అకడమిక్ బ్లాకులు, వసతిగృహాల నిర్మాణం కోసం నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, నిధుల మంజూరులో జాప్యంవల్ల నిర్మా ణం ఆలస్యమైందని తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు 2నెలల సమయం కావాలని కోరారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మనూ భూముల అంశంపై స్పందించారు. విద్యాసంస్థల భూములను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసం వాడుకోవాలని చూస్తోందంటూ ఆరోపించారు. భూములను కాపాడేందుకు విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు అయితే, సాధారణ ఆడిట్‌లో భాగంగానే నోటీసులు పంపామని, ఖాళీగా ఉన్న భూములను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించడం తమ ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మనూ రిజిస్ట్రార్ ఇస్తియాక్ అహ్మద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు. వర్సిటీ భూముల్లో తాము నిర్మించబోయే భవనాలు, వర్సిటీలో కొత్తగా వచ్చే కోర్సుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. రిజిస్ట్రార్ వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. ఆ వివరణను లిఖితపూర్వకంగా తమకు సమర్పిస్తే వర్సిటీకి జారీ చేసిన నోటీసును విరమించుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యాసంస్థల భూములను వెంచర్లలా చూస్తారా?: హరీశ్ రావు
మనూ భూముల అంశంపై బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. విద్యాసంస్థల భూములను రియల్ ఎేస్టట్ వెంచర్లలా చూస్తారా ? అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఎక్స్‌లో బుధవారం ఓ పోస్టు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత ఉర్దూ విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం కన్ను పడిందని ఆరోపించారు. వర్సిటీల భూములను వాటికే వదిలేయాలని, లేదంటే విద్యార్థిలోకం, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
యూనివర్సిటీ భూములు లాక్కుంటే తిరుగుబాటు చేస్తాం : ఏఐఎ్‌సఎఫ్
మనూ భూములు లాక్కుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని ఏఐఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ బుధవారం ప్రకటించారు. యూనివర్సిటీకి షోకాజు నోటీసు ఇవ్వడం సిగ్గుచేటని తెలిపారు. భూములు ఖాళీగా ఉంటే పరిశోధనా కేంద్రాలకు, విద్యార్థుల అవసరాలకు ఉపయోగించాలని సూచించారు. నోటీసును ఉపసంహరించుకుని యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఉర్దూ యూనివర్సిటీ భూములను లాక్కోవాలని చూడటం విద్యా ద్రోహమేనని, విద్యా సంస్థల భూములు రియల్ ఎస్టేట్‌కు అప్పగించవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు.