kumaram bheem asifabad- విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపునకు దోహదం
ABN , Publish Date - Sep 22 , 2026 | 10:42 PM
విద్యార్థుల్లో పఠనాసక్తి, భాషా నైపుణ్యాల పెంపుకు రీడతాన్ దోహదపడుతుందని కలెక్టర్ కె హరిత అన్నారు. పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారంజిల్లా స్థాయి 45 స్కూల్ కాంప్లెక్స్‌లలో విజేతలుగా నిలిచిన ప్రాథమికస్థాయి విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పఠన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో పఠనాసక్తి, భాషా నైపుణ్యాల పెంపుకు రీడతాన్ దోహదపడుతుందని కలెక్టర్ కె హరిత అన్నారు. పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారంజిల్లా స్థాయి 45 స్కూల్ కాంప్లెక్స్‌లలో విజేతలుగా నిలిచిన ప్రాథమికస్థాయి విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పఠన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. చిన్న వయస్సు నుంచే పుస్తక పఠనాన్ని అలవాటుచేసుకోవడం ద్వారా విద్యార్థులో జ్ఞానం, ఆలోచనశక్తి, సృజనాత్మకత, వ్యక్తికరణ సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ నిర్వహిస్తున్న రీడతాన్ కార్యక్రమం అభినందనీయమన్నారు. అనంతరం జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన దహెగాం ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థిని వశిష్ఠ, ద్వితీయ స్థానంలో నిలిచిన రెబ్బెన మండలం గొల్లగూడ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థిని ఐశ్వర్య, తృతీయ స్థానంలో నిలిచిన దహెగాం మండలం చిన్నరాస్‌పల్లి ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్తిణి సాన్వీలకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపుకలెక్టర్ యువరాజ్ మర్మాట్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, విద్యాశాఖ అధికారులు చారి, శ్రీనివాస్, మధు, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రదేశాలను గుర్తించాలి
ప్రతి విద్యార్థి తమ మండలంలోని పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటి ప్రత్యేకతలు చారిత్రత్మాక నేపథ్యం ప్రకృతి అందాలు విశిష్టత తదితర వివరాలను సేకరించి ఉపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని కలెక్టర్ హరిత అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా మంగళవారం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రుపొందించిన చిత్రాలను పరిశీలించి నృత్యపోటీలను తిలకించారు. విజేతలుగా నిలిచిన సంజన, శ్రావణి, ఓంప్రకాష్‌లకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ జోయల్, సైన్స్ అధికారి కటుకం మధుకర్, పరీక్షల సహయ కమీషనర్ జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.
మాతాశిశు మరణాలు నివారించాలి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతాశిశు మరణాలు జరుగకుండా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం డీఎంహెచ్‌వో నాగేంద్రతో కలిసి వైద్య ఆరోగ్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్బంగా మాతాశిశు మరణాలు జరిగిన కుటుంబ సభ్యుల సమక్షంలో మరణాలు సంబవించిన కారణాలపై అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ జిల్లాలో మాతా శివు మరణాల నివారణకు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకొవాలని తెలిపారు. క్రమం తప్పకుండా గర్భిణులకు వైద్య పరీక్షలు అందించి రక్తహీనతతో బాధపడే వారిని గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. గర్భిణులు సుఖ ప్రసవం జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రసవ సమయం కంటే ముందే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు. గర్భిణులకు వైద్యులు అందించే సూచనలను సిబ్బంది వారికి అవగాహన కల్పించాలన్నారు. హైరిస్క్ కలిగిన గర్భిణులను ముందే ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.