నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:56 AM
వ్యవసాయంతో పాటు గృహ, వ్యాపార, వాణిజ్య అవసరాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్13(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంతో పాటు గృహ, వ్యాపార, వాణిజ్య అవసరాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. రూ. 45 కోట్లతో నూతనంగా 15 విద్యుత్ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పవర్‌లూం యూనిట్లపై బిల్లింగ్ భారాన్ని తగ్గించేందుకు వాటి టారిఫ్ కేటగిరి- 3 నుంచి కేటగిరి-4కు మారుస్తూ నిర్ణయించామని వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని 132/33 కేవీ, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను సోమవారం ఆయన పరిశీలించారు. సబ్‌స్టేషన్ల యార్డు పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. పవర్ ఫ్యాక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన కరెంటు సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ సెస్ బాధ్యతలు స్వీకరించే సమయానికి 2,491 వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికే 431 కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. నెలవారీ ప్రాతిపదికన పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించామని అన్నారు. సిరిసిల్ల పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఎన్‌పీడీసీఎల్ రూ.2.5కోట్ల వ్యయంతో సుమారు 80 విద్యుత్ సబ్‌స్టేషన్లను నెలకొల్పిందని అన్నారు. ప్రతి సబ్‌స్టేషన్లలో అత్యాధునిక ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్లను ఏర్పాటు చేశామని అన్నారు. సెస్ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా రెండు, మూడు ఫీడర్లకు అనుసంధానం వల్ల తరుచూ సమస్య తలెత్తేదని అన్నారు. ఉన్నతాధికారులు నిత్యం పర్యటిస్తూ కరెంటు సమస్యలు లేకుండా పనులను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అంతరాయం, సమస్యలు లేకుండా విద్యుత్ అందించేందుకు ఎన్‌పీడీసీఎల్ సిద్ధంగా ఉందని సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఈ భిక్షపతి, డీఈ అంజయ్య, ఏడీఈ శ్రీనివాస్, రాజలింగం, ఏఈ పృథ్వీధర్, ఏవో రాజేందర్ తదితరులు ఉన్నారు.