కంటైనర్ లారీకి మంటలు.. దగ్ధమైన 8 కొత్త కార్లు
ABN , Publish Date - May 22 , 2026 | 04:48 AM
రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులో తరలిస్తున్న 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి.
తూప్రాన్, మే 21 (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులో తరలిస్తున్న 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగింది. నాగ్‌పుర్ నుంచి ఏపీలోని కాకినాడకు వాహనాలను తరలిస్తుండగా తూప్రాన్ శివారులోని నాగులపల్లి చౌరస్తా వద్దకు రాగానే కంటైనర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ నాదీమ్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని హైవే పక్కకు నిలిపివేసి కిందికి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే అందులో ఉన్న కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.