Delivery Speed: 10 నిమిషాల్లో డెలివరీ అక్కర్లేదు!
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:06 AM
ఆకలి వేసినా, ఇంట్లో సరుకులు అయిపోయినా నిమిషాల్లో ఇంటి ముందుకొచ్చే ‘క్విక్ కామర్స్’ డెలివరీలపై వినియోగదారుల ఆలోచన మారుతోంది...
డెలివరీ పార్టనర్ల భద్రతకే వినియోగదారుల మొగ్గు
అత్యవసర ఔషధాలకే సానుకూత
వేగానికి కళ్లెంపై కేంద్రం నిర్ణయానికి 74 శాతం మంది మద్దతు
లోకల్ సర్కిల్స్ తాజా సర్వేలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆకలి వేసినా, ఇంట్లో సరుకులు అయిపోయినా నిమిషాల్లో ఇంటి ముందుకొచ్చే ‘క్విక్ కామర్స్’ డెలివరీలపై వినియోగదారుల ఆలోచన మారుతోంది. 10 నిమిషాల్లో డెలివరీ అంటూ సంస్థలు చేసే వాగ్దానాల కంటే, డెలివరీ బాయ్స్ భద్రత, రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లడమేముఖ్యమని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పది నిమిషాల డెలివరీ ప్రకటనలను నియంత్రించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ యాప్‌లలో ‘10 నిమిషాల డెలివరీ’ అనే వాగ్దానాన్ని తొలగించాలని కేంద్ర కార్మిక శాఖ చేసిన సూచనను సర్వేలో పాల్గొన్నవారిలో 74 శాతం మంది సమర్థించారు.
38 శాతం మంది తమకు ఏ వస్తువూ 10 నిమిషాల్లో అందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. డెలివరీ భాగస్వాములపై ఒత్తిడి పెంచి, వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.
కేవలం అత్యవసర ఔషధాల విషయంలోనే వేగవంతమైన డెలివరీ అవసరమని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
నిత్యావసరాలకు వేగవంతమైన డెలివరీ కావాలని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా చేరుకోవాలనే లక్ష్యంతో డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, అతివేగంగా వాహనాలను నడపడం వంటివి సాధారణ ప్రజల భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని చాలామంది ఆందోళన వ్యక్తంచేశారు. మరో 10-15 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదని, కానీ డెలివరీ చేేస వ్యక్తి సురక్షితంగా రావడమే ముఖ్యమని వారు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా 180 జిల్లాల్లోని సుమారు 90,000 మంది క్విక్ కామర్స్ వినియోగదారుల నుంచి లోకల్ సర్కిల్స్ అభిప్రాయాలను ేసకరించింది. కాగా, ఇప్పటికే బ్లింకిట్ వంటి కొన్ని సంస్థలు 10 నిమిషాల ట్యాగ్‌లైన్‌ను తొలగించాయి.