సౌర విద్యుత్తు యూనిట్లను తగ్గించాకే బిల్లు వేయాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:00 AM
ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వారు వినియోగించే విద్యుత్తును లెక్కించే తీరు సరికాదని దక్షిణ డిస్కం తీరును వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది.
డిస్కంకు వినియోగదారుల ఫోరం ఆదేశం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న వారు వినియోగించే విద్యుత్తును లెక్కించే తీరు సరికాదని దక్షిణ డిస్కం తీరును వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. వినియోగదారుడు ఉపయోగించిన మొత్తం విద్యుత్తు యూనిట్లలో సోలార్ ప్యానెల్ ద్వారా గ్రిడ్‌కు సరఫరా చేసిన యూనిట్లు తొలగించిన తరువాత మిగిలిన నికర యూనిట్లకు మాత్రమే బిల్లు వసూలు చేయాలని ఆదేశించింది. కూకట్‌పల్లి వివేకానందనగర్‌కు చెందిన జి.వేణుగోపాల్ తన ఇంటిపై 3 కిలోవాట్ల సోలార్ పవర్ ప్యానెల్స్‌తోపాటు, దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును లెక్కించడానికి నెట్‌మీటర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఇంటికి సరఫరా అయిన యూనిట్ల నుంచి సోలార్ ప్యానెల్ ద్వారా గ్రిడ్‌కు సరఫరా అయిన యూనిట్లను తగ్గించి, బిల్లులు వేసేవారు. కానీ గత ఏడాది ఆగస్టు నుంచి మాత్రం ఇంటికి సరఫరా అయిన మొత్తం యూనిట్లకు బిల్లులు వేస్తున్నారు. అనంతరం ఆ బిల్లు నుంచి గ్రిడ్‌కు సరఫరా అయిన విద్యుత్తును తగ్గిస్తున్నారు. ఈ కారణంగా శ్లాబులు మారుతున్నాయని, కరెంట్ బిల్లులు రెట్టింపు అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. వాదనలు విన్న ఫోరం చైర్‌పర్సన్ బి లలిత, సభ్యులు మంత్రు నాయక్, వి.అనిల్ రెడ్డిల ధర్మాసనం కేవలం నికర యూనిట్లకు మాత్రమే బిల్లు వేయాలని ఆదేశించింది. మొత్తం బిల్లులను సవరించి 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.