Constables Await Promotions: పదోన్నతుల కోసం కానిస్టేబుళ్ల ఎదురుచూపులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:26 AM
లంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల పదోన్నతుల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఒకే నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరి, ఒకేసారి శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల మధ్య పదోన్నతుల...
పదవీ విరమణ లోపైనా కల్పించాలని వేడుకోలు
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా కానిస్టేబుళ్ల పదోన్నతుల ప్రక్రియ
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల పదోన్నతుల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఒకే నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరి, ఒకేసారి శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల మధ్య పదోన్నతుల విషయంలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న జోనల్ విధానం, కమిషనరేట్ల పరిమితుల వల్ల ఒక ప్రాంతంలో పనిచేస్తున్న వారు ఇప్పటికే అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ల (ఏఎ్‌సఐ) హోదాలో ఉంటే, ఇతర జిల్లాల్లోని వారు పాతికేళ్లు గడిచినా ఇంకా కానిస్టేబుళ్లుగానే మిగిలిపోయారు. ముఖ్యంగా 1995, 1998, 2000 బ్యాచ్‌లకు చెందిన కానిస్టేబుళ్లు ఇప్పటికీ పదోన్నతులు పొందలేదు. సైబరాబాద్ వంటి కమిషనరేట్లలో పదోన్నతుల ప్రక్రియ వేగంగా సాగుతుండగా, హైదరాబాద్ సిటీతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో పదోన్నతి వచ్చేలోపే రిటైర్మెంట్ వయసు దగ్గరపడుతోంది. నిబంధనల ప్రకారం ఎనిమిదేళ్లకే దక్కాల్సిన హెడ్‌కానిస్టేబుల్ హోదా, పాతికేళ్లు దాటినా అందడం లేదు. ప్రభుత్వం సర్వీసును బట్టి ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నప్పటికీ, సమాజంలో గుర్తింపునిచ్చే భుజంపై ‘మూడు పట్టీల’ హోదా కోసం కానిస్టేబుళ్లు వేచిచూస్తున్నారు. కేవలం జీతం పెరిగితే సరిపోదని, తమ సుదీర్ఘ సర్వీసులకు తగిన గౌరవం దక్కాలని, పదవీ విరమణ లోపైనా తమకు పదోన్నతులు కల్పించాలని వారు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.