Share News

హంగ్‌లోనూ హస్తం హవా

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:38 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడిన పురపాలికల్లోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడ్డ 11 మునిసిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తికాగా..

హంగ్‌లోనూ హస్తం హవా

  • మరో 7 మునిసిపాలిటీలు కాంగ్రెస్‌ ఖాతాలోకి

  • 92కు చేరిన అధికార పార్టీ చైర్మన్‌ల సంఖ్య

  • బీఆర్‌ఎ్‌సకు దక్కిన ఇంద్రేశం మునిసిపాలిటీ

  • క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌ స్థానాల్లో మళ్లీ వాయిదా పడిన ఎన్నికలు

  • ఇబ్రహీంపట్నం పాలకవర్గం ఎన్నికపై కోర్టు స్టే

  • క్యాతన్‌పల్లి మునిసిపల్‌ ఎన్నికలో ఉద్రిక్తత

  • మంత్రి వివేక్‌ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్‌ దాడి

  • పార్కింగ్‌ కోన్‌ను విసిరిన బాల్క సుమన్‌

  • జనగామ, తొర్రూరు ఎన్నికల్లో హై‘డ్రా’మా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మునిసిపల్‌ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడిన పురపాలికల్లోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడ్డ 11 మునిసిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తికాగా.. వీటిలో ఏడు మునిసిపాలిటీలు కాంగ్రెస్‌కే దక్కాయి. వీటితో కలిపి 92 మునిసిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు హంగ్‌ మునిసిపాలిటీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఇంద్రేశం దక్కడంతో.. మొత్తం సంఖ్య 18కి చేరింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన మునిసిపాలిటీల సంఖ్య 113కు చేరుకుంది. కాగా, మరో రెండు మునిసిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్నికపై కోర్టు స్టే విధించింది. హంగ్‌ ఏర్పడిన ఇల్లందు, సుల్తానాబాద్‌, ఇంద్రేశం, కాగజ్‌నగర్‌, జహీరాబాద్‌, డోర్నకల్‌, జనగామ, తొర్రూర్‌ మునిసిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోరం లేకపోవడం, సభ్యుల మధ్య విభేదాలు, ఇతర కారణాల వల్ల క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌, ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడిందని పేర్కొన్నారు. వాయిదాకు కారణాలను వివరిస్తూ.. ఎస్‌ఈసీకి సంబందిత జిల్లా కలెక్టర్లు సమాచారం పంపుతారన్నారు. వాటి ఆధారంగా తిరిగి ఎన్నికకు తేదీలను నిర్ణయిస్తూ ఎస్‌ఈసీ మరోసారి షెడ్యూల్‌ ప్రకటిస్తుందని తెలిపారు. ఇక మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ మంగళవారంతో పూర్తయినందున రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో విధించిన ఎన్నికల కోడ్‌ ముగిసిందన్నారు.


కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ పొత్తు..

కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మునిసిపాలిటీని బీజేపీ పొత్తుతో కాంగ్రెస్‌ దక్కించుకుంది. ఇక్కడ ఇక్కడ బీజేపీ రెండుగా చీలిపోయి.. ముగ్గురు కాంగ్రెస్‌కు, ఇద్దరు సభ్యులు బీఆర్‌ఎ్‌సకు మద్దతు పలికారు. దీంతో కాంగ్రె్‌సకు చెందిన షాహీన్‌ సుల్తానా చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో మరో బీజేపీ కౌన్సిలర్‌ బీఆర్‌ఎ్‌సకు ఓటు వేయడంతో ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. అధికారులు డ్రా తీయగా బీఆర్‌ఎస్‌ బలపరిచిన బీజేపీ కౌన్సిలర్‌ కొత్తపల్లి అనితను వైస్‌ చైర్మన్‌ పదవి వరించింది. ఇక చైర్మన్‌ పదవికి నెలకొన్న పోటీ కారణంగా వాయిదా పడిన సుల్తానాబాద్‌ మునిసిపాలిటీని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా బిరుదు రాధాకృష్ణ, వైస్‌ చైర్మన్‌గా అంతటి పుష్పలత ఎన్నికయ్యారు.


క్యాతన్‌పల్లిలో ఉద్రిక్తం..

క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బీఆర్‌ఎస్‌, సీపీఐ సభ్యులను ప్రమాణ స్వీకారం కోసం మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కోవ లక్ష్మి తన అనుచరులతో కలిసి ర్యాలీగా తీసుకెళ్తుండగా.. ర్యాలీ వద్దంటూ పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తరువాత మంత్రి జి.వివేక్‌, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్‌ రాగా.. బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకొని రాళ్లదాడికి దిగారు. బాల్క సుమన్‌ ఓ ప్లాస్టిక్‌ పార్కింక్‌ కోన్‌ను మంత్రి వాహనంపైకి విసిరారు. దాడిలో మంత్రి వాహనం అద్దాలు ధ్వంసం కాగా, ఓ కానిస్టేబుల్‌కు, ఇద్దరు కాంగ్రెస్‌ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో మంత్రి కాన్వాయ్‌లో ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా రావడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ చేయగా ఒక బీఆర్‌ఎస్‌ నాయకుడి చేతులపై గాయాలయ్యాయి. సభ్యుల ప్రమాణం అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతుండగా, ఇరు పార్టీ సభ్యులు ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త వాతారణం నెలకొంది. దీంతో కాంగ్రెస్‌ సభ్యులను వెంటబెట్టుకొని మంత్రి, ఎంపీ ఇరువురూ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి ప్రకటించారు.


జనగామలో హై‘డ్రా’మా!

జనగామ మునిసిపల్‌ పీఠం హైడ్రామా నడుమ కాంగ్రెస్‌ను వరించింది. ఉద్రిక్తతల మధ్య డ్రా తీయగా.. చైర్మన్‌ పదవి కడకంచి బాలమణికి దక్కింది. వైస్‌ చైర్మన్‌ పదవి బీఆర్‌ఎ్‌సకు మద్దతిచ్చిన స్వతంత్ర సభ్యుడు బూష పర్వతాలును వరించింది. కాగా, స్వతంత్ర సభ్యురాలు మంజుల.. బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థికి మద్దతుగా చెయ్యి ఎత్తగా.. పాండు, కరుణాకర్‌రెడ్డి ఆమె చేతిని బలవంతంగా కిందకు దించే ప్రయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేయాలంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొర్రూరు, డోర్నకల్‌ మునిసిపాలిటీల ఎన్నికలు పోలీసుల నిఘా నీడన జరిగాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ మాలోతు కవితలను నర్సింహులపేటలో అరెస్టు చేయగా, సత్యవతిరాథోడ్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఎక్స్‌ అఫీషియో ఓట్లతో రెండు పార్టీల బలం సమానం కావడంతో డ్రా పద్ధతిన ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రె్‌సకు చెందిన తూనం శ్రావణ్‌ చైర్మన్‌గా, సోమ రజిని వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక డోర్నకల్‌లో కాంగ్రె్‌సకు పూర్తి మెజారిటీ రావడంతోకొండేటి రాజకుమారి చైర్‌పర్సన్‌గా, మాద లావణ్య వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.


ఇల్లెందులో ప్రశాంతంగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక మంగళవారం ప్రశాంతంగా పూర్తయ్యింది. శిబిరంలో ఉన్న కాంగ్రెస్‌ సభ్యులు ఎన్నిక షెడ్యూల్‌ తేదీ అయిన 16వ తేదీ నిర్ణీత సమయానికి చేరుకోకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ ఎన్నికలో చైర్‌పర్సన్‌గా కాంగ్రె్‌సకు చెందిన దొడ్డ కిరణ్‌మిత్ర, వైస్‌చైర్మన్‌గా పెండేల రాజు ఎన్నికయ్యారు. కాగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మున్సిసిపాలిటీని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. చమహ్మద్‌ యూసు్‌ఫను చైర్మన్‌గా, కాంగ్రె్‌సకు మద్దతిచ్చిన ఇండిపెండెంట్‌ అభ్యర్థి శిరీషాసురేందర్‌రెడ్డిని వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు ఇక ఇంద్రేశం మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా, వైస్‌ చైర్‌పర్సన్‌లుగా బీఆర్‌ఎ్‌సకు చెందిన ప్రమీల, హరీశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. కాగా, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మునిసిపాలిటీలో ఇరు పార్టీల సభ్యులెవరూ మంగళవారం కూడా హాజరు కాకపోవడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.


ఇబ్రహీంపట్నం ఎన్నికపై కోర్టు స్టే

ఇబ్రహీంపట్నం మునిస్పల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది.. 19వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఆకుల యాదగిరిని కిడ్నాప్‌ చేశారని, ఆయనను కోర్టులో ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలంటూ ఆయన కుమారుడు ఆకుల హరికాంత్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం.. ఆకుల యాదగిరిని బుధవారం తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. యాదగిరి ఓటు వేయకుండా మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికను నిర్వహించరాదని, ఒకవేళ నిర్వహించినా సదరు ఎన్నిక చెల్లదని పేర్కొంది. అయితే యాదగిరి కిడ్నాప్‌ కాలేదని, మునిసిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు హాజరయ్యారని, ఎన్నిక ఫలితాలు ప్రకటించేలా ఆదేశాలు జారీచేయాలని లంచ్‌మోషన్‌ రూపంలో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఎలాగూ బుధవారం యాదగిరిని ప్రవేశపెట్టాలని ఆదేశాలు ఇచ్చినందున బుధవారమే విచారణ చేపడతామని పేర్కొంది. ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన మయాంక్‌ మిట్ట్టల్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ సభ్యులు 13 మంది(ఆకుల యదగిరి సహా), బీజేపీ సభ్యురాలు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు కలిసి బీఆర్‌ఎ్‌సకు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనతంరం వైస్‌ చైర్మన్‌ ఎన్నికను నిర్వహించేందుకు పూనుకోగా కోర్టు స్టే వచ్చిందని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ శ్రీధర్‌రెడ్డి నుంచి ఫోన్‌ వచ్చిందని ప్రిసైడింగ్‌ అధికారి తెలిపారు. ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆకుల యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

జిల్లా ఎన్నికల అధికారులతో సీఈవో సుదర్శన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)పై వారితో చర్చించారు.

Updated Date - Feb 18 , 2026 | 04:40 AM