రాష్ట్రంలో మళ్లీ అధికారం కాంగ్రెస్‌దే
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:47 AM
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు..
సోనియా వల్లే తెలంగాణ: మహేశ్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని, రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో మంగళవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహే్‌షగౌడ్ మాట్లాడుతూ.. సోనియాగాంధీ దృఢ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ద్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో బంగారు తెలంగాణ అంటూ మాట్లాడారని, కానీ ఆ మాటలు అన్నవారి కుటుంబం మాత్రమే బంగారం అయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పేదవాడి అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా పాలన కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. వేడుకల్లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ యాదవ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ డాక్టర్స్ సెల్ కార్యవర్గ సమావేశంలో మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. తానూ డాక్టర్ అవ్వాలనుకున్నానని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కాలేక పోయానని చెప్పారు. పార్టీ కోసం సమయం కేటాయిస్తున్న డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.
రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.