బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు!
ABN , Publish Date - May 12 , 2026 | 03:53 AM
బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తేల్చిచెప్పారు. ‘కారు.. సారు.. పదహారు..
అహంకారం వల్లే కేసీఆర్ ఓడిపోయారు.. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరు
బండి సంజయ్ మా నాయకుడు
కుటుంబంలో జరిగిన ఘటనతో పార్టీకి సంబంధం లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తేల్చిచెప్పారు. ‘కారు.. సారు.. పదహారు.. అంటూ ఆనాడు బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేసుకున్నారని, ఎంపీ ఎన్నికల్లో ప్రజలు సున్నా సీట్లు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అహంకారం పెరిగిపోయిందని.. ఇందువల్లే, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న స్థానాలను కూడా కోల్పోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు చేపడతామన్నారు. బీఆర్‌ఎస్ లాగే కాంగ్రెస్ కూడా, ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెసంటే ముస్లింలని... ముస్లింలంటే కాంగ్రెసని సీఎం రేవంత్ గతంలో చేసిన ప్రకటనను రాంచందర్‌రావు గుర్తుచేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్‌గా మారుతోందని ప్రధాని మోదీ కూడా వ్యాఖ్యానించారని ఆయన చెప్పారు. ‘బెంగాల్, అసోం, కేరళల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుందన్నారు. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలివచ్చారని, ఎన్నికలు లేని సమయంలో కూడా ఇంతటి జనసంద్రం కనిపించడం తెలంగాణలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని రాంచందర్‌రావు చెప్పారు. మోదీ నాయకత్వం తెలంగాణలో కొత్త రాజకీయ దిశను తీసుకురాబోతోందని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
చట్టం తనపని తాను చేసుకుపోతుంది
బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై రాంచందర్‌రావు స్పందిస్తూ, అది బండి సంజయ్ కుటుంబానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఆ ఘటనతో పార్టీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ‘బండి సంజయ్ మా నాయకుడు. మా మంత్రి.. ఆయనకు దీనితో సంబంధం లేదు... ఒకవేళ ఆయన కుటుంబసభ్యుల పాత్ర ఉంటే ఉంటే అది పోలీసులు దర్యాప్తు చేస్తారు.. కుటుంబంలో జరిగిన సంఘటన.. అది లీగల్ అంశం.. చట్టం తనపని తాను చేసుకుపోతుంది..’ అని రాంచందర్‌రావు వివరించారు.
ఆ పోలిక రాజకీయ అపరిపక్వతే
ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని మన్మోహన్ సర్కార్‌తో పోల్చడమంటే రాజకీయ అపరిపక్వతేనని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ స్పష్టం చేశారు. గుజరాత్ అభివృద్థి చెందడానికి కారణం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం, అర్థరహితమన్నారు. కలిసి పనిచేయండి అని మోదీ చేసిన వ్యాఖ్య రాజకీయ వ్యంగ్యం కాదని, కేంద్రంతో సమన్వయంతో పనిచేేస రాష్ర్టాలే వేగంగా అభివృద్థి చెందుతాయని సుభాష్ చెప్పారు.