రాష్ట్రంలోనూ ఓటు చోరీకి చాన్స్!
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:29 AM
ఓటరు జాబితా పరిశీలనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పట్ల అప్రమత్తంగా ఉండాలని ....
సర్ పట్ల అప్రమత్తంగా ఉండండి
మీనాక్షి, మహేశ్‌గౌడ్ దిశానిర్దేశం
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా పరిశీలనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పట్ల అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీనటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. సర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలోనూ ఓటు చోరీ జరిగే అవకా శం ఉందని హెచ్చరించారు. ఆదివారం రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, మాస్టర్ ట్రైనర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో వారు జూమ్ ద్వారా సమావేశమై.. సర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. దేశంలో బీజేపీ, ఈసీ కలిసి ఓటు చోరీకి పాల్పడుతున్నాయని, తద్వారా బీజేపీ అప్రజాస్వామికంగా అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. తెలంగాణలోనూ ఓటు చోరీకి పాల్పడే అవకాశం ఉన్నందున అన్ని నియోజకవర్గాల్లోని నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు ఓటు మ్యాపింగ్‌ను లోతుగా పరిశీలించి నిజమైన ఓటును కాపాడాలని సూచించారు. ఒకవేళ నిజమైన ఓటును తొలగిస్తే.. తగిన ఆధారాలతో ఆ ఓటరుతో తిరిగి దరఖాస్తు చేయించి ఓటు పునరుద్ధరణ జరిగే లా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా కీలకమని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటునూ కాపాడుకోవాలని చెప్పారు. మూడు లోక్‌సభ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకుని ఒక్కో యూనిట్‌తో అరగంట చొప్పున జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాగా, రాష్ట్రంలోని బీఎల్‌ఏలలో 90శాతం మందికి సర్ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాలు పూర్తయినట్లు మాస్టర్ ట్రైనర్లు తెలిపారు. జూమ్ మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ట్రైనింగ్ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.