Share News

స్థానిక ఎన్నికల్లో ఎం2 ఈవీఎంలు వద్దు

ABN , Publish Date - May 20 , 2026 | 03:03 AM

జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్‌ ఎన్నికల కోసం ఎం2 మోడల్‌ ఈవీఎం యంత్రాలను వినియోగించాలన్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని...

స్థానిక ఎన్నికల్లో ఎం2 ఈవీఎంలు వద్దు

  • బ్యాలెట్‌ ఓటింగ్‌ చేపట్టండి

  • ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ నేతల వినతి

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్‌ ఎన్నికల కోసం ఎం2 మోడల్‌ ఈవీఎం యంత్రాలను వినియోగించాలన్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని, ఈ ఎన్నికల్లో బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజేష్‌ కుమార్‌, సభ్యులు సింగిశెట్టి జగదీశ్వర్‌రావు, గోపిశెట్టి రాఘవేందర్‌, టి.రేవతిగౌడ్‌, కాసభ శ్రీనివా్‌సరావు మంగళవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో కార్యదర్శి లింగ్య నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్ల ఎన్నికల్లో బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానానికే కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తుందని ఎస్‌ఈసీ కార్యదర్శికి తెలియపర్చామన్నారు. ఎం2 మోడల్‌ ఈవీఎంలకు వీవీప్యాట్‌ సౌకర్యం లేదని, అందువల్లే ఈ ఎన్నికలకు బ్యాలెట్‌ పేపర్‌ను వినియోగించాలని కోరామన్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశం మేరకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి చుడిబజార్‌లోని ఈసీఐఎల్‌ ఇంజనీర్ల ద్వారా ఈవీఎంల చెకింగ్‌, ఎఫ్‌ఎల్‌సీ ప్రక్రియ ప్రారంభించారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎం2 ఈవీఎం యంత్రాలను ఉపయోగించొద్దని, బ్యాలెట్‌ ఓటింగ్‌ పై దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ నేతలు ఎస్‌ఈసీని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 20 , 2026 | 03:03 AM