Share News

ప్రజలతో మమేకమవ్వాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:42 AM

ప్రజలతో మమేకమై కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు.

ప్రజలతో మమేకమవ్వాలి

  • డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజలతో మమేకమై కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఈ ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలతో సన్నిహితంగా ఉంటూ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. సమన్వయం, క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేస్తే కాంగ్రెస్‌ పార్టీకి మరింత ప్రజాదరణ లభిస్తుందని తెలిపారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం, ఉద్యమ నేపథ్యం, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, ఆశయాలు, అమరుల త్యాగాలు, లక్ష్యాలు తదితర అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర పోరాటానికి దారితీసిన పోరాట గాథను స్మరించుకుంటూ.. ఉద్యమ స్పూర్తిని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను వివరించారు. అంతకు ముందు మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు.. కాంగ్రెస్‌ చరిత్ర, ఛరఖా గురించి అవగాహన కల్పించారు. సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ చైర్మన్‌ సచిన్‌రావు ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వంశీచందర్‌రెడ్డి, చైర్మన్‌ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో శిబిరం కొనసాగుతోంది. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ శిక్షణా శిబిరంలో ఆదివారం ఛరఖా తిప్పి నూలు వడికారు. డీసీసీ అధ్యక్షులు కూడా చరఖా తిప్పుతూ నూలు వడికారు. అంతకు ముందుకు ఛరఖా ప్రాముఖ్యత గురించి వివరించిన శిక్షకులు నూలు వడికే విధానంపై అవగాహన కల్పించారు.

Updated Date - Feb 23 , 2026 | 02:42 AM