Share News

రెండు రాజ్యసభ సీట్లూ కాంగ్రె్‌సకే!

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:28 AM

రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ సీట్లూ కాంగ్రెస్‌ ఖాతాలోనే చేరనున్నాయి. శాసనసభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం, సమీకరణాలను బట్టి రెండు స్థానాలనూ కాంగ్రెస్‌ గెలుచుకోవడం.....

రెండు రాజ్యసభ సీట్లూ కాంగ్రె్‌సకే!

  • అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు 66 మంది..

  • సీపీఐ, బీఆర్‌ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలూ కలిపి 77కు పెరగనున్న బలం.. అదనంగా ఎంఐఎం అండ

  • ఒక రాజ్యసభ స్థానం కోసం పరిస్థితిని బట్టి 35-40 మంది వరకు ఎమ్మెల్యేలు అవసరం

  • బీఆర్‌ఎ్‌సకు నికరంగా ఉన్నది 27 మందే!

  • రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా.. సభ్యులపై అనర్హత వర్తించదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ సీట్లూ కాంగ్రెస్‌ ఖాతాలోనే చేరనున్నాయి. శాసనసభలో పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం, సమీకరణాలను బట్టి రెండు స్థానాలనూ కాంగ్రెస్‌ గెలుచుకోవడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్‌ మను సింఘ్వి (కాంగ్రెస్‌), సురేశ్‌రెడ్డి (బీఆర్‌ఎ్‌స)ల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. దీనితో ఆ రెండు స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యను నిర్ధారించేందుకు ఒక సూత్రాన్ని పాటిస్తారు. అందుబాటులో ఉన్న రాజ్యసభ సీట్ల సంఖ్యకు ఒకటి కలిపి (2+1).. నమోదైన ఓట్ల సంఖ్య (119)తో భాగిస్తారు. ఆ వచ్చిన ఫలితానికి ఒకటిని కలిపి (39.6+1) గెలుపు కోసం అవసరమైన ఓట్ల సంఖ్యను నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం ఒక్కో స్థానానికి కనీసం 40 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఎమ్మెల్యేలు ఎవరైనా ఓటింగ్‌కు గైర్హాజరైతే.. ఆమేరకు కనీసం అవసరమైన బలం తగ్గుతుంది.


ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

ప్రస్తుతం కాంగ్రె్‌సకు మిత్రపక్షం సీపీఐతో కలిపి 67 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినా అనర్హత నిబంధన వర్తించదు. ఈ లెక్కన బీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించిన వారినీ కలిపితే కాంగ్రెస్‌ బలం 77కు చేరుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోగా బీఆర్‌ఎస్‌కు మిగిలినది 27 మందే. ఇంకా 13 ఓట్లు తక్కువగా ఉన్నాయి. దీనితో కాంగ్రెస్‌ ఒక సీటును నేరుగా, రెండో సీటును రెండో ప్రాధాన్య ఓట్లతో గెలుచుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ, ఎంఐఎం మద్దతు తీసుకున్నా బీఆర్‌ఎ్‌సకు సీటు దక్కే అవకాశం లేదు.

  • ఒకవేళ బీజేపీ, ఎంఐఎం ఓటింగ్‌కు దూరంగా ఉంటే.. ఫార్ములా ప్రకారం గెలవడానికి అవసరమైన ఓట్ల సంఖ్య 35కు తగ్గుతుంది. కాంగ్రె్‌సకు 77 మంది బలం ఉండటంతో నేరుగా రెండు సీట్లనూ గెలుచుకుంటుంది.

  • ఒకవేళ బీజేపీగానీ, ఎంఐఎంగానీ ఒక్క పార్టీయే ఓటింగ్‌కు దూరంగా ఉంటే.. విజయానికి అవసరమైన ఓట్ల సంఖ్య 38కి చేరుతుంది. అందులో మిగిలిన ఏ పార్టీ మద్దతు తీసుకున్నా బీఆర్‌ఎ్‌సకు బలం సరిపోదు.

  • బీజేపీ, ఎంఐఎంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంటే.. విజయానికి అవసరమైన ఓట్ల సంఖ్య 32కు తగ్గుతుంది. ఇదే జరిగితే కాంగ్రె్‌సకు ఉన్న బలం మేరకు రెండు రాజ్యసభ సీట్లు నేరుగానే గెలుచుకుంటుంది.

  • మొత్తంగా రెండు రాజ్యసభ స్థానాలూ కాంగ్రె్‌సకే దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినా అనర్హత నిబంధన వర్తించకపోవడం కూడా అధికార కాంగ్రె్‌సకు కలిసి వస్తుందని అంటున్నాయి.

Updated Date - Feb 20 , 2026 | 01:28 AM