Share News

రెండేళ్ల పాలనపై సమీక్ష

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:28 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. అలాగే రాష్ట్రంలో పార్టీ పురోగతిపైనా సమీక్షించనుంది.

రెండేళ్ల పాలనపై సమీక్ష

  • సీఎం, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆహ్వానం.. రేపు ఢిల్లీలో భేటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. అలాగే రాష్ట్రంలో పార్టీ పురోగతిపైనా సమీక్షించనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌లను ఆహ్వానించింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగే సమీక్షలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు పాల్గొననున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన నేపథ్యంలో ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న పార్టీ.. అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌లతోనూ భేటీ అవుతున్నారు. రెండేళ్లలో తెలంగాణలో ప్రభుత్వం, పార్టీ సాధించిన పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌లు నివేదికలను సిద్ధం చేసుకున్నారు. అధిష్ఠానం కూడా రాష్ట్ర పురోగతి నివేదికలను సిద్ధం చేసుకుంది. రెండు నివేదికల ఆధారంగా సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన అద్భుత విజయాలను సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి వివరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామీణ, పట్టణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారనడానికి ఈ విజయాలే నిదర్శనమనీ వివరించనున్నట్లు తెలుస్తోంది.


స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ పరంగా 50 శాతానికి పైగా అమలు చేసిందనీ వివరించనున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా సాధించిన విజయాలనూ వివరించనున్నట్లు చెబుతున్నారు. ఈ విజయాలకు అభినందనలు తెలుపుతూనే పాలన, పార్టీ పరంగా ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని అధిష్ఠానం సూచించినున్నట్లు సమాచారం. ఖాళీగా ఉన్న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర పదవుల భర్తీ, ప్రభుత్వ పరంగా నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు మంత్రులు, నాయకులపై వచ్చిన ఆరోపణల మీద కూడా పార్టీ పెద్దలు సమీక్షిస్తారని సమాచారం.


ముంబై వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ముంబై బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై కార్పొరేషన్‌ భాగస్వామ్యంలో జరుగుతున్న ముంబై క్లైమేట్‌ వీక్‌ సదస్సులో రేవంత్‌ పాల్గొననున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ ఆహ్వానం మేరకు ఆయన సదస్సుకు హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్‌ ప్రగతి, పాలనా సంబంధిత అంశాల్లో సాధించిన విజయాలను ఈ వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి వివరించనున్నారు. జియో కన్వెన్షన్‌ సెంటర్లో జరిగే సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. సదస్సులో పాల్గొన్న అనంతరం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్తారు. గురువారం ఉదయం అధిష్ఠానంతో సమావేశం అవుతారు. అనంతరం ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026లో పాల్గొంటారు.

Updated Date - Feb 18 , 2026 | 04:29 AM