Share News

అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం

ABN , Publish Date - Feb 01 , 2026 | 07:02 AM

తెలంగాణ, ఏపీలకు చెందిన జిల్లా కాంగ్రెస్‌ కమిటీల (డీసీసీ) అధ్యక్షులకు వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో శిక్షణా తరగతులు నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది.

అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం

  • ఈనెల 21 నుంచి మార్చి 3 వరకు తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు

  • ఖర్గే, రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌ హాజరు

వికారాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ, ఏపీలకు చెందిన జిల్లా కాంగ్రెస్‌ కమిటీల (డీసీసీ) అధ్యక్షులకు వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో శిక్షణా తరగతులు నిర్వహించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సంస్థాగతంగా, క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నాయకత్వ సామర్థ్యాలపై డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహి ంచనున్నట్లు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ శిక్షణా తరగతులకు హాజరు కానున్నట్లు తెలిసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. శనివారం హరిత రిసార్ట్స్‌ను కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులు నిర్వహించే హాల్‌, డీసీసీ అధ్యక్షులు విడిది చేసే గదులను ఆమె పరిశీలించి.. కల్పించాల్సిన సదుపాయాలపై ఆరా తీశారు. ఆమె వెంట సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 07:03 AM