‘ప్రతినిధి’ పరీక్షలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 05:08 AM
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అధికార ప్రతినిధుల ఎంపిక కోసం టాలెంట్ హంట్ పేరిట వినూత్న ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది.
పార్టీ అధికార ప్రతినిధుల ఎంపికకు కాంగ్రెస్ పరీక్షలు
తెలంగాణలో సెలక్షన్ కమిటీ కన్వీనర్‌గా సామా రామ్మోహన్‌రెడ్డి
వచ్చే 15 రోజులు దరఖాస్తుల స్వీకరణ.. ఆ తర్వాత పరీక్షలు
ఎంపికైన వారికి ఆరు నెలల శిక్షణ
దరఖాస్తు బ్రోచర్‌ను విడుదల చేసిన పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అధికార ప్రతినిధుల ఎంపిక కోసం టాలెంట్ హంట్ పేరిట వినూత్న ప్రక్రియకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ ప్రక్రియలో భాగంగా పార్టీ అధికార ప్రతినిధి పదవిని ఆశిస్తున్నవారి మధ్య జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనుంది. పోటీలో ప్రతిభ కనబరిచినవారిని ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ కమిటీకి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అనంతరం దరఖాస్తు బ్రోచర్‌ను విడుదల చేశారు.
ఎంపిక ప్రక్రియ ఇలా..!
టాలెంట్ హంట్‌లో భాగంగా రానున్న 15 రోజుల పాటు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పార్టీ కార్యకర్తల నుంచే కాకుండా టతస్థుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత రెండు ఉమ్మడి జిల్లాల చొప్పున ఒక పోటీ పరీక్షను సెలక్షన్ కమిటీ నిర్వహిస్తుంది. దరఖాస్తుదారుల మధ్య వివిధ అంశాలపైన పోటీలు నిర్వహించి మంచి ప్రదర్శన కనబరిచినవారిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి.. ఇతర పార్టీలవారు ఈ ప్రక్రియలోకి చొరబడకుండా చర్యలు తీసుకోనున్నట్లు సామా రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారికి రాష్ట్ర స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తమ ప్రదర్శన చూపిన వారిని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమిస్తారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని జిల్లా స్థాయిలో అధికార ప్రతినిధులుగా, ఆ తర్వాతి స్థాయి వారిని రీసెర్చ్ విభాగంలోకి, మిగిలిన వారిని పబ్లిసిటీ కో ఆర్డినేటర్లుగా నియమిస్తారు. ఎంపికైనవారికి ఆరు నెలలపాటు శిక్షణ ఉంటుంది.
నూతన ఒరవడికి రాహుల్ శ్రీకారం: మహేష్‌గౌడ్
టాలెంట్ హంట్ ద్వారా అధికార ప్రతినిధులను నియమించే నూతన ఒరవడికి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ శ్రీకారం చుట్టినట్లు మహేష్‌గౌడ్ వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్నవారికి అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. లౌకిక వాదంపై పట్టున్న వ్యక్తులను గుర్తిం చి ఎంపిక చేస్తామని తెలిపారు. మంచి వక్తలకు ఇది సువర్ణావకాశమన్నారు. దేశ నిర్మాణంలో యు వత కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో రాహుల్‌గాంధీ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని చెప్పారు.