Share News

కేటీఆర్‌ది దురహంకారం

ABN , Publish Date - May 07 , 2026 | 05:05 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలపై వరంగల్‌ సభలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.

కేటీఆర్‌ది దురహంకారం

  • ఓటములు, కుటుంబ కలహాల నిరాశలో రాహుల్‌, రేవంత్‌లపై అడ్డగోలు వ్యాఖ్యలు

  • క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌

హైదరాబాద్‌/హుస్నాబాద్‌ రూరల్‌/ములుగు, మే 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలపై వరంగల్‌ సభలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరుస ఓటములు, కుటుంబ కలహాలతో నిరాశలో కూరుకుపోయిన కేటీఆర్‌.. రాహుల్‌ గాంధీని దూషించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు బేడీలు వేయించిన, మల్లన్నసాగర్‌, గౌరవెల్లి ముంపు బాధితులపై అర్ధరాత్రి లాఠీచార్జి జరిపించిన చరిత్ర బీఆర్‌ఎ్‌సదని మండిపడ్డారు. వరంగల్‌ సదస్సులో కేటీఆర్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని మంత్రి సీతక్క మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, ‘‘కేటీఆర్‌ జాగ్రత్త.. సీఎం రేవంత్‌రెడ్డిపై నోరు పారేసుకుంటే ఊరుకోబోం. రైతులను దగా చేసిన నీచ చరిత్ర మీదే..’’ అని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

రాహుల్‌ను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదు: మహేశ్‌గౌడ్‌

కేటీఆర్‌ ఒక 420 అని, పాస్‌పోర్టు కుంభకోణం నుంచి భూముల స్కాం వరకు ఆయన కుటుంబమే ఉందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. రాహుల్‌, రేవంత్‌లను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. తిట్లతో రాజకీయాలు చేసే పార్టీలు, నాయకులు నిలబడరని.. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్‌ ఎమ్మెల్యేగా కూడా గెలవరని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్నీ పరామర్శించని కేటీఆర్‌.. ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ విమర్శించారు. రేవంత్‌పై దిగజారుడు భాష మాట్లాడుతున్న కేటీఆర్‌పై ఇక తామూ దిగజారుడు భాషే మాట్లాడతామని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు. హరీశ్‌రావుకంటే గొప్పోడు అనిపించుకునేందుకు కేటీఆర్‌ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ విమర్శించారు.

Updated Date - May 07 , 2026 | 05:05 AM