బాల్క సుమన్.. సంఘ విద్రోహ శక్తి
ABN , Publish Date - May 28 , 2026 | 03:20 AM
ప్రభుత్వ ఆస్తులు, సింగరేణి కార్యాలయాలు తగలబెట్టాలని పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని...
ఆయన్ను అరెస్టు చేయాలి: బల్మూరి వెంకట్
సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నది వాళ్లే: చనగాని
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్తులు, సింగరేణి కార్యాలయాలు తగలబెట్టాలని పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మండలిలో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సూచించారు. బాల్క సుమన్ వంటి వ్యక్తులు సమాజంలో ఉండడం మంచిది కాదన్నారు. సీఎల్పీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాల్క సుమన్.. ఓ సంఘ విద్రోహ శక్తిలా మాట్లాడాడని విమర్శించారు. ఆయనది మొదటి నుంచీ నేర ప్రవృత్తేనని, తన రాజకీయ ఎదుగుదల కోసం ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టాడని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బాల్క సుమన్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. సింగరేణి కార్మికులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై బహిరంగ చర్చకు రావాలని పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్‌కౌశిక్ యాదవ్ సవాల్ విసిరారు. బాల్క సుమన్ హెచ్చరికలు, బెదిరింపులకు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదన్నారు. సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో ఒక ఉగ్రవాదిలా మాట్లాడిన బాల్క సుమన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర బీఆర్‌ఎ్‌సదేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ధ్వజమెత్తారు. బాల్క సుమన్ గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
సుమన్‌పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి భవన్‌ను కాల్చివేయాలని, రైల్వే ట్రాక్‌లు కట్ చేయాలని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌కు చెందిన ప్రభుత్వ విప్‌లు బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్‌లు డీజీపీని కోరారు.