80 శాతం హస్తగతం
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:58 AM
ఊహించినట్లే రాష్ట్రంలోని అత్యధిక మునిసిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మొత్తం 116 మునిసిపాలిటీలకుగాను సోమవారం 105 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగగా..
105 మునిసిపాలిటీల్లో 85 కాంగ్రె్‌సవే
ఐదు కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకే
కారుకు దక్కింది 17 పురపాలికలు మాత్రమే
11 చోట్ల వాయిదా.. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు
కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలోకి
సీపీఐకి దక్కిన కొత్తగూడెం కార్పొరేషన్
హంగ్ మునిసిపాలిటీల్లో అత్యధికం హస్తానికే
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఊహించినట్లే రాష్ట్రంలోని అత్యధిక మునిసిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మొత్తం 116 మునిసిపాలిటీలకుగాను సోమవారం 105 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగగా.. వీటిలో 85 మునిసిపాలిటీలను అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తంగా 80 శాతం పురపాలికలను తమ ఖాతాలో వేసుకుంది. ఏడు కార్పొరేషన్లలోనూ ఐదింటిని దక్కించుకుంది. మరో చోట సీపీఐతో కలిసి మేయర్ పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సకు 17 మునిసిపాలిటీలు మాత్రమే దక్కాయి. ఇందులోనూ 8 మునిసిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనివే. కాగా, ఏడు కార్పొరేషన్లలో ఏ ఒక్క చోటా పోటీ ఇవ్వలేక పోయింది. ఇక బీజేపీ ఒక్కొక్కటి చొప్పున మునిసిపాలిటీ, కార్పొరేషన్‌తో సరిపెట్టుకుంది. ఒక మునిసిపాలిటీ చైర్మన్‌గా ఫార్వర్డ్ బ్లాక్, మరోచోట స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మరో 11 మునిసిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. కాగా, ఏడు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరగగా.. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లను అధికార కాంగ్రెస్ దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపిన నిజామాబాద్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు ఇచ్చి.. మేయర్ పదవిని తీసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ చెరో రెండున్నరేళ్లు మేయర్ పీఠాన్ని తీసుకోవాలని అవగాహనకు వచ్చాయి. తొలి రెండున్నరేళ్ల అవకాశాన్ని సీపీఐకి ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ తీసుకుంది.
ఉత్కంఠ మధ్య నిజామాబాద్ మేయర్ ఎన్నిక..
నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ఉత్కంఠ నడుమ జరిగింది. ఈ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్‌లకుగాను బీజేపీకి 28, కాంగ్రె్‌సకు 17, ఎంఐఎంకు 14 సీట్లు, బీఆర్‌ఎ్‌సకు ఒక సీటు వచ్చాయి. ఇక బీజేపీ నుంచి ఎంపీ అరవింద్, ఇద్దరు ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, సూర్యనారాయణ గుప్తా, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎక్స్ అఫీషియో ఓట్లను నమోదు చేసుకోవడంతో మొత్తం సభ్యుల సంఖ్య 65కి చేరింది. మ్యాజిక్ ఫిగర్ 33కు చేరగా.. ఎంఐఎం, ఇండిపెండెంట్‌తో కలిపి 34 ఓట్లున్న కాంగ్రెస్ తమ మేయర్ అభ్యర్థిగా కూరగాయల ఉమారాణిని నిలబెట్టింది. డిప్యూటీ మేయర్ పదవికి ఎంఐఎంకు చెందిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి సల్మా తహసీన్ పేరును ప్రతిపాదించారు. రెండు పార్టీల ఉమ్మడి బలంతో ఈ ఇద్దరూ గెలుపొందారు.
కరీంనగర్‌లో విఫలమైన కాంగ్రెస్ వ్యూహం..
కరీంనగర్ కార్పొరేషన్‌ను వ్యూహ ప్రతివ్యూహాల అనంతరం బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లను కలుపుకొని కూటమిగా ఏర్పడి కార్పొరేషన్‌ను చేజిక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రె్‌సకు మద్దతిచ్చే విషయంలో బీఆర్‌ఎస్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో మేయర్ పీఠం కమలం పార్టీకి దక్కింది. మరోవైపు మహబూబ్‌నగర్ మేయర్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. 60 మంది సభ్యులున్న కార్పొరేషన్‌లో కాంగ్రెస్ తరఫున 29 మంది గెలుపొందారు. వీరితోపాటు ఇండిపెండెంట్లుగా గెలిచిన నలుగురు అభ్యర్థులను తీసుకొని క్యాంపునకు వెళ్లారు. ఏపీలోని చీరాలకు వెళ్లిన వీరంతా ఆదివారం రాత్రి శంషాబాద్ సమీపంలోని రిసార్ట్‌కు వచ్చారు. అయితే మేయర్ పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న ప్రసన్న భర్త ఆన ంద్‌గౌడ్ ను సోమవారం శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కార్పొరేటర్‌లకు డబ్బులు పంచుతున్నారన్న ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు కొంత డబ్బును కార్పొరేటర్‌ల నుంచి రికవరీ చేసుకున్నారు. ఆనంద్‌గౌడ్ అరెస్ట్ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో క్యాంపులో ఉన్న సభ్యులను తీసుకొని ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో పాలమూరుకు బయలుదేరారు. పోలీసులు గంట తరువాత ఆనంద్‌గౌడ్‌ను వదిలిపెట్టగా మధ్యలో బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. కార్పొరేటర్లు నేరుగా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోగా.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి సమక్షంలో మేయర్‌గా గుమాల్ మమత, డిప్యూటీ మేయర్‌గా ఎం.సురేందర్‌రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
హంగ్ మునిసిపాలిటీల్లో అత్యధికం హస్తం ఖాతాలోకే
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి, చైర్మన్ పదవిని కాంగ్రెస్ గెలుచుకుంది.
కామారెడ్డి మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్ మద్దతుతో చైర్మన్ పదవిని గెలుచుకున్న కాంగ్రెస్.. వైస్ చైర్మన్ పదవిని ఆ పార్టీకి ఇచ్చింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన సభ్యులు కాంగ్రె్‌సకు మద్దతివ్వగా.. ఆయనకు డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు.
గద్వాలలో స్వతంత్రులు, ఎంఐఎం మద్దతుతోపాటు ఎంపీ మల్లు రవి ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది.
అమరచింత మునిసిపాలిటీని బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి దక్కించుకుంటాయని భావించగా.. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన జింక సువర్ణను కాంగ్రె్‌సలోకి చేర్చుకొని ఆమెకే చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు.
అలంపూర్ మునిసిపాలిటీని ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
నారాయణపేటలో బీఆర్‌ఎస్ మద్దతు పొందడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీజేపీ దక్కించుకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా కేసముద్రం మునిసిపాలిటీని ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ గెలుచుకుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఒకే వార్డు గెలిచిన కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను తమవైపు తిప్పుకొని.. బీజేపీ మద్దతుతో చైర్మన్‌ను చేసింది.
మొయినాబాద్ మునిసిపాలిటీని స్వతంత్రులతోపాటు బీఆర్‌ఎస్ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ దక్కించుకుంది.
ఎల్లంపేట మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్.. బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవిని పొంది, వైస్ చైర్మన్ పదవిని కమలం పార్టీకి ఇచ్చింది.
అలియాబాద్‌లో బీజేపీ, బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఆదిలాబాద్ మునిసిపల్ చైర్మన్‌గా తొలుత ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్నికవగా.. ఆ తరువాత ఆయన కాంగ్రె్‌సలో చేరడంతో ఈ మునిసిపాలిటీ కూడా అధికార పార్టీ ఖాతాలోకి చేరింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఇండిపెండెంట్ అభ్యర్థి ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో మునిసిపాలిటీ గులాబీ ఖాతాలో పడింది.
ఆ మునిసిపాలిటీల్లోనూ...!
వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లోనూ ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో సుల్తానాబాద్, డోర్నకల్, ఇల్లందు మునిసిపాలిటీల చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం లాంఛనమేనని చెబుతున్నారు. జహీరాబాద్, కాగజ్‌నగర్, ఖానాపూర్ మునిసిపాలిటీల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులతో చర్చలు జరుగుతున్నాయి. జనగామ, తొర్రూర్‌లలో బలాబలాలు సమానంగా ఉండటంతో అక్కడ టాస్ వేసే పరిస్థితి రావచ్చునని చెబుతున్నారు. ఇబ్రహీంపట్నం, ఇంద్రేశం, క్యాతన్‌పల్లి విషయంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, వాయిదా పడిన మునిసిపాలిటీల్లో 8 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు కాంగ్రెస్ తరఫున పరిశీలకులను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్ష నటరాజన్ నియమించారు.