Share News

kumaram bheem asifabad- నైరాశ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు

ABN , Publish Date - Feb 17 , 2026 | 10:23 PM

ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ పీఠాన్ని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోకపోవడంతో ఈ ఆంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.

kumaram bheem asifabad- నైరాశ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు
లోగో

- గ్రూపు విభేదాలే కొంపముంచాయి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ పీఠాన్ని బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోకపోవడంతో ఈ ఆంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు విభేదాలే వారి కొంప ముంచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరికి వారే గ్రూపులుగా వార్డుల్లో అభ్యర్థులను బరిలో దించడంతో పార్టీకి అనుకూలమైన సీట్లు చేజిక్కించుకోలేదని అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. సర్పంచ్‌ ఎన్నికల్లో సైతం ఆసిపాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌తో పోలిస్తే అధికంగా బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. . తాజాగా జరిగిన ఆసిఫాబాద్‌ మున్సిపాల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పదవులు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరుతోనే కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలవలేక పోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల మధ్య సఖ్యత లోపించడంతో పాటు కిందిస్థాయి కార్యకర్తలు పార్టీపై నాయకులపై నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా పార్టీలో ఉండటానికి కూడ ఇష్టపడడంలేదని తెలుస్తోంది. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా నాయకుల వైఫల్యం కనిపించిందంటూ జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది.

- కాంగ్రెస్‌ రెబల్స్‌ గెలుపుతో...

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ రెబల్స్‌ గెలుపుతో అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించి బగ్గపడ్డ అభ్యర్థులు వారివారి వార్డుల్లో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. టికెట్‌ ఆశించిన సందర్భంలో వార్డులో సర్వే నిర్వహించామని సర్వేలో మీపేరు లేదని గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ అధినాయకులు ఆ స్థానాల్లో వారిని కాదని వేరే వారికి టికెట్‌ ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. మున్సిపాలిటీలోని 1, 2, 10, 18 వార్డుల్లో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇదిలా ఉండగా కొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అదినాయకులు పార్టీ అభ్యర్థులకు పోటిగా వార్డుల్లో ఒకరిద్దరిని బరిలో ఉంచినట్లు ఆరోపణలు లేకపోలేదు. దీంతో అయా వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందడం పెద్ద సహసంగానే మారింది. పార్టీ నుంచి భీఫాం ఇచ్చాక వేరే అభ్యర్థులను బరిలో దించారని తమను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్వయంగా అభ్యర్థులే బహటంగా చెప్పుకోవడం ఇందుకు అద్దం పడుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు విబేదాలు తారస్థాయికి చేరడంతోనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయినట్లు తెలుస్తోంది.

- ఆసిఫాబాద్‌ పరిధిలో..

ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలి టీలలో 90కి పైగా మున్సిపాలిటీలు అధికార కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకుంది. తాజాగా మంగళవారం కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ ఛైర్మన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ దక్కించుకోవడంతో ఆసిఫాబాద్‌ పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఇందులో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7, కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడి కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌గా బరిలో నిలిచి గెలుపొందిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. దీంతో మ్యాజిక్‌ ఫీగర్‌ రావలంటే స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు స్వతంత్ర అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు రాజకీయం నిర్వహించారు. సోమవారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉండడంతో స్వతంత్రుల మద్దతు కూడగట్టుకొని మున్సిపల్‌ పీఠాన్ని కైవసం చేసుకొవాలని ప్రయత్నించిన కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి గుండా స్నేహ బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంతో ఎమ్మెల్యే ఎక్స్‌ అఫిసియో ఓటు కలుపుకొని మ్యాజిక్‌ ఫిగర్‌ 11 రావడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు చేజారాయి. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంటామని భరోసలో ఉన్న అదికార పార్టీ కాంగ్రెస్‌కు ఒక్కసారి చుక్కెదురు కావడంతో కంగుతి న్నారు. చివరి క్షణంలో కాంగ్రెస్‌ నుండి గెలిచిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి మద్దతు ఇవ్వ డం ఏంటని, పార్టీ నాయకుల వైఫల్యమే ఇందుకు కారణమని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు మండి పడుతున్నారు.

Updated Date - Feb 17 , 2026 | 10:23 PM