Congress Plans to Replicate Panchayat Election: పురపాలికల్లోనూ పాగా వేద్దాం
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:47 AM
పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మునిసిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని నిర్ణయించింది.
పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం
అభ్యర్థుల ఎంపికే కీలకం.. గెలుపే ఇందుకు ప్రాతిపదిక
సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్ భేటీలో నిర్ణయం
ఫిబ్రవరి మూడో వారంలో మున్సిపోల్స్ ఉండే చాన్స్
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మునిసిపల్ ఎన్నికల్లోనూ ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని నిశ్చయించింది. మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు దక్కించుకుని పురపాలికల్లోనూ పాగా వేయాలని నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ, పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడానికి గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, టీపీసీసీ విస్తృత సమావేశం అజెండాను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌తో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అసెంబ్లీలోని సీఎం చాంబర్లో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనే చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులూ ఈ భేటీలో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలవడం ద్వారా ప్రభుత్వ పాలన పట్ల గ్రామీణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చాటగలిగామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ విజయాన్ని పునరావృతం చేయడం ద్వారా పట్టణ ప్రజలు కూడా పాలనపై సానుకూలంగా ఉన్నారని చాటాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని అనుకున్నారు. డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థుల ఎంపికే ఇందులో కీలకమని, గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక ఉండాలని నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక న్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావించారు. ప్రతి డివిజన్/వార్డుకు ఆరుగురు చొప్పున ఆశావహులను ఎంపిక చేసి సర్వేలు నిర్వహించాలని, వాటి ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కాగా.. ఏఐసీసీ పిలుపు మేరకు ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాల నిర్వహణపైనా మాట్లాడుకున్నారు. కాగా.. కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ద్వారా సాగునీటి రంగానికి సంబంధించి కేసీఆర్‌పై వారికి ఉన్న భ్రమలను తొలగించగలిగామన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. కవిత రాజీనామా అంశమూ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాజీనామా సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం.. బీఆర్‌ఎస్‌కు నష్టం చేకూరుస్తుందని,మహిళల్లో ఇది చర్చనీయాంశంగా మారనుందని ఒకరిద్దరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి మూడో వారంలో మున్సిపోల్స్..!
మెగా హైదరాబాద్ మినహా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ఈనెల చివరి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని చెబుతున్నారు.