ఎంఐఎంకు మేయర్.. కాంగ్రెస్ ఒప్పందం
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:43 AM
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
కరీంనగర్‌లో ఓడతామని తెలిసే ముఖ్యమంత్రి రాలేదు
ఆ చెప్పుల దొంగకు ఓట్లెందుకేయాలి
బజార్లో అప్పు కూడా పుట్టని వ్యక్తితో లాభమేంటి..?
కరీంనగర్ అభివృద్ధి బాధ్యత నాదే
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్/కరీంనగర్/భగత్‌నగర్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారి ఒప్పందం చేసుకుందన్నారు. ఓటమిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారంతోనే సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌కు రాకుండా చొప్పదండి నుంచే పారిపోయారని ఎద్దేవా చేశారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. ‘ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకొని పోయే దొంగలా చూస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు.. అలాంటి చెప్పుల దొంగకు ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయాలి? బజార్లో అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభం. నిధు లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు?’ అంటూ ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలపై నిలదీయాలన్నారు. బీఆర్‌ఎస్ నేతలు వస్తే.. పదేళ్ల పాలనలో దోచుకుతిన్నందుకు ఓటేయాలా అని ప్రశ్నించాలని కోరారు. పొరపాటున ఆ పార్టీలకు ఓటేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేస్తారని చెప్పారు.
నిధులు ఎవరు తెచ్చారు?
కరీంనగర్ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు తెచ్చి తాను అభివృద్ధి చేస్తే.. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆ నిధులు తామే తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని సంజయ్ మండిపడ్డారు. ‘ప్రధానికి గంగుల, వినోద్ ముఖాలైనా తెలుసా.. మోదీ వాళ్లను గుర్తు పడతారా? వాళ్లు నిధులడిగితే మోదీ ఎందుకు ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు. ‘కరీంనగర్‌లో గంగుల మనుషులు కబ్జాలు తప్ప చేసిందేమీ లేదు. పేదోళ్ల జాగాలను కబ్జా చేయించిన 9 మంది కార్పొరేటర్లను నేనే జైలులో వేయించా.. అలాంటి కబ్జాకోర్లను గెలవనిద్దామా..?’ అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే జరిగిందని, ఇందుకు రూ.1,500 కోట్లు మోదీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు కూడా కరీంనగర్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్ల నిధులు వచ్చి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే దాని అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని ప్రకటించారు. తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లింలను భయపెట్టి కంట్రోల్‌లో పెట్టుకునే ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకమని ఆయన చెప్పారు.