నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్‌దే!
ABN , Publish Date - Feb 14 , 2026 | 04:24 AM
తీవ్ర ఉత్కంఠ రేపిన నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం చివరికి అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎంఐఎంతో కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 31 సాధించే అవకాశం
నిజామాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తీవ్ర ఉత్కంఠ రేపిన నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం చివరికి అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పార్టీ.. మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. మేయర్ పదవి దక్కాలంటే 31 స్థానాలు అవసరమవుతాయి. అయితే బీజేపీ అత్యధికంగా 28 సీట్లను గెలుచుకున్నా.. మ్యాజిక్ ఫిగర్‌కు మూడు అడుగుల దూరంలో ఉండిపోయింది. ఇక కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజన్లను గెలుచుకున్నాయి. బీఆర్‌ఎస్ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పీసీసీ అద్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సొంత జిల్లా కావడంతో ఇందుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం జతకడితే 31 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్‌ను అందుకునే అవకాశాలున్నాయి. దీనికితోడు ఎక్స్ అఫీషియో సభ్యుల రూపంలో కాంగ్రెస్‌కు రెండు ఓట్లు అదనంగా ఉన్నాయి. మరోవైపు బీజేపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారి ఓట్లతో మేయర్ పీఠం కోసం కమలం పార్టీ కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో సమీకరణాల్లో తేడా రాకుండా.. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్‌ను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రే తన శిబిరంలోకి లాగేసుకుంది. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగినట్లయింది.