Share News

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌వి ఇంగితం లేని మాటలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:44 AM

సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌ వాడకంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇంగితం మరిచి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ విమర్శించారు.

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌వి ఇంగితం లేని మాటలు

  • ఎమ్మెల్సీ, విప్‌ అద్దంకి దయాకర్‌

  • సీఎం రేవంత్‌పై మాట్లాడే స్థాయి హరీశ్‌కు లేదు: ఎంఏ ఫహీం

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌ వాడకంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇంగితం మరిచి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ విమర్శించారు. సీఎంపై ఆర్‌ఎస్‌ అబద్దాలు ప్రచారం చేయడం మానుకోవాలని, కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేయడం ఆపాలని అద్దంకి హితవు పలికారు. సీఎల్పీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ దుష్ప్రచారమే ధ్యేయంగా మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ కుటుంబంతో పాటు సీఎంవో అధికారులు కూడా హెలికాప్టర్లు వాడిన విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ రక్షణ కోసం గతంలో ఏకంగా 30 బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లను తయారు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఎర్రవెల్లి ఫామ్‌హౌ్‌సకు వెళ్తుంటే సామాన్య ప్రజలు రోడ్లపై గంటల తరబడి నరకం అనుభవించేవారని, కానీ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తన భద్రతను కూడా పక్కనపెట్టి కేవలం మూడు వాహనాల కాన్వాయ్‌తో సామాన్యుడిలా ప్రయాణిస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడే స్థాయి బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావుకు లేదని, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తాము సరిపోతామని ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఏ. ఫహీం అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న హరీశ్‌రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో మిషన్‌ కాకతీయను కమీషన్‌ కాకతీయగా మార్చారని, కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14 స్థానాలు గెలుస్తామని ప్రగల్బాలు పలుకుతున్న హరీశ్‌రావు.. ముందు మెదక్‌లో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏంటో చూసుకోవాలన్నారు. అక్కడ కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 07 , 2026 | 06:44 AM