Share News

కేసీఆర్‌..నిజాయితీ చాటుకో

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:54 AM

మాజీ సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఉండకపోతే.. ఆ భూమిని కొలిచి హద్దులు తేల్చాల్సిందిగా తానే స్వయంగా కోరాలని కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం స్థానిక ఆర్‌డీవో కార్యాలయంలో, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని కేసీఆర్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.

కేసీఆర్‌..నిజాయితీ చాటుకో
congress leaders

  • మీ భూమిని కొలిచివ్వాలని దరఖాస్తు చేస్కో

  • వెలికట్టలో 6.13 ఎకరాల్ని హరీశ్‌ తన

  • మామకు అక్రమంగా కట్టబెట్టారు

  • రంగనాయక సాగర్‌కు 2,212 ఎకరాలకు

  • గాను 2183 ఎకరాలే సేకరించారు

  • హరీశ్‌రావు రూ.2 లక్షలకు ఎలా కొన్నారు?

  • విచారణ జరిపిస్తాం: కాంగ్రెస్‌ నేతలు

  • హరీశ్‌ భూములను సందర్శించిన బృందం

  • వెలికట్ట, రంగనాయకసాగర్‌ వద్ద హరీశ్‌,

  • ఆయన బంధువుల భూముల పరిశీలన

సిద్దిపేట, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌ కోసం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఉండకపోతే.. ఆ భూమిని కొలిచి హద్దులు తేల్చాల్సిందిగా తానే స్వయంగా కోరాలని కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం స్థానిక ఆర్‌డీవో కార్యాలయంలో, జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని కేసీఆర్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో, సిద్దిపేట శివారులోని రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఆయన మామ హనుమంతరావుభూములను వారు సందర్శించారు. ఈ భూములను హరీశ్‌రావు, హనుమంతరావు అక్రమంగా సొంతం చేసుకున్నారని, దీనికి సంబంధించి నిజాలు తెలుసుకునేందుకంటూ శాటిలైట్‌ మ్యాప్‌, తదితర పత్రాలతో కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెలికట్ట క్రాస్‌రోడ్‌ వద్ద సర్వే నంబర్‌ 271లో మాజీ సైనికుడు సత్యనారాయణచారికి కేటాయించిన 6.13 ఎకరాల భూమితో హనుమంతరావుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. వేరొకరి ఎన్‌వోసీ తీసుకొచ్చి భూమిని తన మామ పేరిట హరీశ్‌రావు రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపించారు. ఈ భూమిని అక్రమమని స్పష్టంగా తేలిందన్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేశారని కొండపాక తహసీల్దార్‌ను ప్రశ్నించారు.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, జరిగిన అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడానికే తాము సిద్దిపేట జిల్లాకు వచ్చామని చెప్పారు. దాడులు జరిగే అవకాశం ఉందనే కారణంతోనే భద్రతతో వచ్చామని, లేకుంటే ఒంటరిగానే వచ్చేవాళ్లమని అన్నారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌లో షెడ్యూల్‌ ప్రకారం 2,212 ఎకరాల భూమిని సేకరించాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలిపారు. ఇందుకోసం 12 గంటల్లోనే నోటిపికేషన్‌ జారీ చేసిందని, అయితే 2,183 ఎకరాలను మాత్రమే సేకరించిందని చెప్పారు. మిగతా భూమిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. అంతేకాకుండా సుడా పార్కు కోసం 10 ఎకరాలను ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఎందుకు కేటాయించారో అర్థం కావడంలేదన్నారు. రంగనాయకసాగర్‌ వద్ద విలాసవంతంగా ఉండాలనే ఉద్దేశంతో హరీశ్‌రావు 13.12 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారని ఆరోపించారు. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు కింద భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.6-13 లక్షల వరకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, హరీశ్‌రావు మాత్రం ఎకరాకు రూ.2 లక్షల చొప్పున ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. రైతులను ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి అక్రమంగా తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దాంతో పాటు ఇరిగేషన్‌ నిధులు రూ.5.33 కోట్లతో తన ఫాంహౌ్‌సకు వెళ్లేందుకు రోడ్డు వేయించుకోవడం దారుణమన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. ప్రజలే అసలు శిక్ష వేస్తారన్నారు.


ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం..

22ఏ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. దానికి చెక్‌ పెట్టేందుకే ఇక్కడికి వచ్చామన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్‌ఎస్‌ భూ దందాకు పాల్పడిందని ధ్వజమెత్తారు. వెలికట్టలో అక్రమంగా తీసుకున్న భూమిని ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు అందిస్తామన్నారు. అధికారం పోయినా బీఆర్‌ఎస్‌ నేతలకు బలుపు పోలేదని, వారి భూదందాలపై ఈడీవిచారణ చేపట్టాలని అన్నారు. ఈ బృందంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లురవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, సురేష్‌ షెట్కార్‌, కడియం కావ్య, బలరాంనాయక్‌, వేం నరేందర్‌రెడ్డి,ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 05:58 AM