Share News

ఆ నేతలను బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:13 AM

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు తీవ్రంగా మండిపడ్డారు.

ఆ నేతలను బర్తరఫ్‌ చేయాలి

  • షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టొద్దు

  • సీఎంపై అనుచిత వ్యాఖ్యల్ని సహించం

  • ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజారిస్తే ఊర్కోం

  • కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్రలు

  • సుస్మిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం

  • కూతురితో వెనకుండి మాట్లాడించిన మంత్రి కొండా సురేఖ

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫైర్‌

  • సుస్మిత క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్‌లు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీకి నష్టం కలిగించేలా, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా మాట్లాడుతున్న నేతలపై అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టకుండా వారిని పార్టీ నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో శుక్రవారం వారు సీఎల్పీ మీడియా హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేలాది మంది కార్యకర్తలు రక్తం ధారపోసి సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సాధించుకున్న ప్రజా ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచేలా మాట్లాడటం వెనుక బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి తామంతా పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చేయని అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని, కేసీఆర్‌ చేసిన అప్పులు, తప్పులను సీఎం రేవంత్‌ రెడ్డి సరిదిద్దుతున్నారని అన్నారు.


ప్రతిపక్షాలు మాట్లాడితే సరేగానీ.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత.. సీఎం రేవంత్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తన కుమార్తె వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వెంటనే స్పందించాలని, ఆ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి జెండా మోసి ప్రభుత్వాన్ని తెచ్చారని, అంతర్గత విషయాలను సీఎల్పీలో, పార్టీ వేదికల్లోనే మాట్లాడాలని సూచించారు. రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేసేంతవరకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


సభ్యత్వం లేనివారు మాట్లాడితే సహించం

ముఖ్యమంత్రిపై ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడిని కోరుతున్నామని మరో ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం అన్నారు. సీఎం నిర్ణయాలను తప్పుబట్టే వారికి పార్టీలో ఉండే నైతిక అర్హత లేదన్నారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే తీరు సరైంది కాదని హితవు పలికారు. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదంటున్న కొండా సురేఖ.. ఆ మాటలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పార్టీలో సభ్యత్వం లేనివారు బజారు రౌడీల్లా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి సుస్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టకుండా.. కులం, హోదాతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డిని బలహీనపస్తే పార్టీ బలహీనపడుతుందన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న ప్రత్యర్థులకు కొందరు ఆయుధాలు అందిస్తున్నారని ఆరోపించారు. చిన్నారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి లాంటివారే కాకుండా ఎవరు మాట్లాడినా చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు, నలుగురు నేతలు తమ స్వార్థం కోసం, పదవుల కోసం రోడ్డెక్కి ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేస్తూ ప్రతిపక్షాలకు అస్ర్తాలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు బీ-ఫారాలు ఎత్తుకెళ్లిన చరిత్ర వీరిదన్నారు. అంత చేసినా.. మంత్రి పదవి ఇస్తే పార్టీకి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. మంత్రి సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


సుస్మితతో వెనక ఉండి మాట్లాడించిన సురేఖ..

ముఖ్యమంత్రిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమెవి కావని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. కొండా సురేఖే వెనుక ఉండి మాట్లాడించారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ సినిమా హీరోలపై, సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు అన్యాయం చేసేవారిని అధిష్ఠానం వెంటనే బర్తరఫ్‌ చేయాలని కోరారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి బలహీనుడు కాదని, ఆయన ధైర్యానికి భయపడి.. కొందరు కుట్రలు చేస్తున్నారని అన్నారు. పార్టీకి, సీఎం ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. శాసనమండలి ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ, ‘పార్టీ కంటే నేనే పెద్ద, నా వల్లనే కాంగ్రెస్‌ గెలిచిందని భావించే వారికి పార్టీలో స్థానం లేదు’ అన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మందుల సామేలు, చిక్కుడు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్‌ రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సుస్మితవి తప్పుడు వ్యాఖ్యలు: జంగా రాఘవరెడ్డి

మడికొండ: సీఎం రేవంత్‌రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకా్‌షరెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తప్పుడు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 05:15 AM