కేటీఆర్ తీరును అసహ్యించుకుంటున్న ప్రజలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:16 AM
సిట్ విచారణకు వెళుతూ తానేదో పోరాట యోధుడినని ఊహించుకుంటూ హడావుడి చేస్తున్న కేటీఆర్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రె స్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హైదరబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సిట్ విచారణకు వెళుతూ తానేదో పోరాట యోధుడినని ఊహించుకుంటూ హడావుడి చేస్తున్న కేటీఆర్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన పాపాలకు మరో 10 ఏళ్లు విచారణ చేసినా సమయం సరిపోదని ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అధికారానికి ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులెన్ని.. ఇప్పుడెన్ని..? 130 ఏళ్ల కాంగ్రె్‌సకు లేని ఆస్తులు 25 ఏళ్ల బీఆర్‌ఎ్‌సకు ఎలా వచ్చాయి..? మునిసిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసం జిల్లాలు రద్దు చేస్తారని బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. బావ, బావమరిది ప్రభుత్వ అధికారులను తిడుతున్నారు.. బెదిరిస్తున్నారు. బోగస్ యూట్యూబ్ చానెల్స్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ నుంచి ఎత్తుకుపోయారు. కోదండరాం, మందకృష్ణ మాదిగ, బండి సంజయ్ లాంటి వారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు. తన క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారని అంటున్న కేటీఆర్ కట్టు కథలు అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
ఉపాధి పథకానికి కేంద్రం తూట్లు: సచిన్ సావంత్
పేద కార్మికులకు వేతన భద్రత కల్పించకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మండిపడ్డారు. గ్రామీణ పేద కుటుంబాలు వలసలు వెళ్లే పరిస్థితులు దాపురించాయని.. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు సాగే ‘ఎంజీ ఎన్‌రేగా బచావో సంగ్రామ్ యాత్ర’ను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావుతో కలిసి సచిన్ సావంత్ శనివారం ప్రారంభించారు. వీహెచ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఎంజీ ఎన్‌రేగా ఆత్మను నాశనం చేయాలని చూస్తోందని.. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉపాధిని డిమాండ్ చేసే చట్టబద్ధ హక్కును కేంద్రం హరిస్తోందని దుయ్యబట్టారు.