భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:34 AM
భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతాడని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ఒక బీసీ నేత సీఎం అవుతాడని ఆ పార్టీల అధ్యక్షులు కేసీఆర్....
ఓ బీసీని సీఎం చేస్తామని చెప్పే దమ్ము బీజేపీ, బీఆర్‌ఎ్‌సల అధ్యక్షులకు ఉందా?
ఆ రెండూ బీసీ వ్యతిరేక పార్టీలే..
వంద సీట్లతో కాంగ్రెస్‌కు మళ్లీ అధికారం ఖాయం: మహేశ్‌గౌడ్
హైదరాబాద్/షాద్‌నగర్/కేశంపేట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతాడని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ఒక బీసీ నేత సీఎం అవుతాడని ఆ పార్టీల అధ్యక్షులు కేసీఆర్, ఎన్.రాంచందర్‌రావులకు చెప్పే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు బీసీ వ్యతిరేక పార్టీలని విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ బీసీ సెల్ చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కన్వీనర్‌గా కేతూరి వెంకటేశ్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మహేశ్ గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వంద సీట్లతో కాంగ్రెస్ మరోమారు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అప్పటికి డీలిమిటేషన్ జరిగితే 140 సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్పారు. కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో 65 శాతం బీసీలకు ఇచ్చామని, 67 శాతం పంచాయతీల్లో బీసీ సర్పంచ్‌లను గెలిపించుకున్నామన్నారు. దేవుళ్ల పేర్లు చెప్పడం తప్ప కేంద్ర మంత్రిగా బీసీలకు బండి సంజయ్ చేసిందేముందని ప్రశ్నించారు. వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని.. బీసీలు ఏకమై కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. కులగణన సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపితే పెండింగ్‌లో ఎందుకు పెట్టారో బీజేపీ నేతలే సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నో రాష్ట్రాలకు బీసీలను సీఎంలు, గవర్నర్‌లుగా చేసిన పార్టీ కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని బలహీన వర్గాలను సంఘటితం చేయాలని ఓబీసీ సెల్‌కు మంత్రి పొన్నం సూచించారు. అనంతరం శంకర్‌ను షాద్‌నగర్ నేతలు, కార్యకర్తలు సన్మానించారు.
పార్టీలో మహిళలకు ప్రాధాన్యం..
కాంగ్రెస్‌లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని మహేశ్‌గౌడ్ అన్నారు. కష్టపడి పనిచేసే వారిని పదవులే వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల్లో నూ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.