CPI leader K. Narayana: నిబంధనలకు విరుద్ధంగా బార్లు, వైన్స్ నిర్వహణ
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:13 AM
లిక్కర్ విధానంలో మార్పులు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ప్రభుత్వ అప్పులను తీర్చడానికి మద్యం దుకాణాల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని సీపీఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ ...
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ చైర్మన్ నారాయణ
ఖమ్మం కార్పొరేషన్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): లిక్కర్ విధానంలో మార్పులు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ప్రభుత్వ అప్పులను తీర్చడానికి మద్యం దుకాణాల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని సీపీఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికంటే ఎక్కువ ఆదాయం సంపాదించడానికే లిక్కర్‌ను కంట్రోల్ చేయలేక పోతోందన్నారు. తొలిసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపునకు మద్యం దుకాణాల దరఖాస్తుల ఫీజును రూ.3లక్షలు పెంచిందన్నారఽు. ప్రభుత్వాలు మారినా లిక్కర్ దోపిడీ మారలేదని చెప్పారు. ఖమ్మంలో మద్యం వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఓ పాత్రికేయుడు ఇచ్చిన సమాచారంతో నారాయణ.. సోమవారం నగరంలోని ప్రముఖ లిక్కర్ మార్టుకు అకస్మికంగా వెళ్లి.. దాని నిర్వాహకులు, పక్కనే గల వైన్స్‌లో మద్యం తాగుతున్న వారి వద్దకెళ్లి మద్యం ధరలు అడిగి తెలుసుకున్నారు. ధరల దోపిడీ జరుగుతున్నదని నారాయణకు మద్యం ప్రియులు చెప్పారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. కొందరు ఒక దుకాణానికి అనుమతి తీసుకుని.. వెనుక.. పక్కన అనధికార దుకాణాలు నడుపుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు బార్లు, వైన్స్‌ల నిర్వహణ జరగటం లేదని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.