Share News

హైదరాబాద్‌లో మీరు కట్టిన ఇళ్ల కంటే ఎక్కువే నిర్మిస్తాం

ABN , Publish Date - May 28 , 2026 | 03:59 AM

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌లో కట్టిన ఇళ్ల కంటే వచ్చే రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ ....

హైదరాబాద్‌లో మీరు కట్టిన ఇళ్ల కంటే ఎక్కువే నిర్మిస్తాం

  • లేదంటే పోటీ చేయను.. నువ్వు సిద్ధమేనా కేటీఆర్‌..?.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు రెండేళ్ల కాంగ్రెస్‌ సర్కారు సవాల్‌

  • త్వరలో లక్ష ఇళ్లకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ: పొంగులేటి

హైదరాబాద్‌/హైదరాబాద్‌సిటీ/చాదర్‌ఘాట్‌/గన్‌పార్క్‌/చాంద్రాయణగుట్ట, మే 27 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌లో కట్టిన ఇళ్ల కంటే వచ్చే రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. ఒకవేళ ఎక్కువ ఇళ్లను నిర్మిస్తే కేటీఆర్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు రెండేళ్ల కాంగ్రెస్‌ సర్కారు చేస్తున్న సవాల్‌ ఇదని వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. ఓఆర్‌ఆర్‌ లోపల తొలి దశలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుందన్నారు. రెండో దశలో కూడా పట్టణ ప్రాంతాలకు లక్ష ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపలున్న 24 నియోజకవర్గాల పరిధిలో ఇళ్ల స్థలాల పరిశీలన ప్రారంభించామన్నారు. 1,000 గజాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి.. ఆడబిడ్డల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామని చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు కోసమే తాము పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే తాము ఓట్లు అడుగుతామని.. బీఆర్‌ఎస్‌ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లోనే ఓట్లు అడగడానికి వారు సిద్ధమా..? అని నిలదీశారు. గత పాలకులు అక్కడక్కడ ఊరికి ఐదో, పదో ఇళ్లు మాత్రమే నిర్మించి పేదలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వారు కట్టించిన ఇళ్లలోనూ లబ్ధిదారులు ఉండలేని పరిస్థితి ఉందని, 20 వేల ఇళ్లు అసంపూర్తిగా నిర్మించి వదిలేశారన్నారు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణలో 12 వేల గ్రామ పంచాయతీల్లో పది వేల పంచాయతీల్లో ఇక్క ఇల్లు అయినా కట్టారా అని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 12 వేల పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిందన్నారు.


హైదరాబాద్‌లో ఖాళీ స్థలాల పరిశీలన..

హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని జియాగూడ పోలీసు క్వార్టర్స్‌, మంగార్‌ బస్తీ బాంబే కాలనీ, నాంపల్లి రెడ్‌హిల్స్‌, పోలీస్‌ క్వార్టర్స్‌, ఫలక్‌నుమాలో 2 బీహెచ్‌కే డిగ్నిటీ కాలనీ, బండ్లగూడ మండలంలోని ఫారుఖ్‌నగర్‌ ఖాళీ స్థలాలను, మలక్‌పేటలో శిథిలావస్థకు చేరిన కాలాడేరా బీ బ్లాక్స్‌లోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌ను మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రి అజారుద్దీన్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్‌ బలాల, మాజిద్‌ హుస్సేన్‌, మహ్మద్‌ ముబీన్‌ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని పేదల సొంతింటి కలను నెరవేర్చడమే సర్కారు ధ్యేయమని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను వేగవంతంగా మ్యాపింగ్‌ చేసి గృహ నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - May 28 , 2026 | 03:59 AM