కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్
ABN , Publish Date - May 27 , 2026 | 04:45 AM
రైతులకు మాయమాటలు చెప్పి అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభు త్వం అనతికాలంలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు విమర్శించారు.
రేవంత్ రాజీనామా చేసి ఎన్నికలకు రా.. వారంలోగా ధాన్యం, మక్కలను కొనుగోలు చేయకుంటే భరతం పడతాం
బీజేపీ ఎంపీలు రఘునందన్, ఈటల రాజేందర్ ధ్వజం
ధాన్యం సేకరణలో సీఎంవి తప్పుడు లెక్కలు
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ఆత్మకూరు, యాదాద్రి, జనగామ రూరల్, మే 26 (ఆంధ్రజ్యోతి): రైతులకు మాయమాటలు చెప్పి అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభు త్వం అనతికాలంలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు విమర్శించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన ‘రైతుల అరిగోస - బీజేపీ భరోసా’ కార్యక్రమంలో వారు పాల్గొని రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వారం లోపే రైతులు పండించిన వరి ధాన్యం, మక్కజొన్నలను కొలుగోలు చేయకుంటే సీఎం భరతం పడుతామని హెచ్చరించారు. రైతులు అధైర్యపడొద్దని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ కొనసాగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పతనమవుతుందన్నారు. అనంతరం ఎంపీ రఘునందర్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పంటలు కొనుగోలు చేశామని బూటకపు మాటలు మాట్లాడుతున్నారని, ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రైతులను మోసం చేయడంతోనే అడ్రస్ లేకుండా పోయిందని, రైతు ల గోస తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని అన్నారు. రైతులు పడుతున్న కష్టాన్ని చూసిన ఆర్టీసీ డ్రైవర్ ‘ప్రభు త్వం ధాన్యం, మక్కలు కొనుగోలు చేయా లన్నందుకు సస్పెండ్ చేస్తావా?నీకు దమ్ముం టే మేము ఎంపీలం, ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం వచ్చాం సస్పెండ్ చేయి.. బిడ్డా మా తడాఖా చూపిస్తాం’ అని సీఎంను ఉద్దేశించి అన్నారు. ధాన్యం సేకరణ 80 శాతం వరకు పూర్తయిందని తప్పుడు లెక్క లు చెబుతూ రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘నేను చూపే కొనుగోలు కేంద్రానికి వచ్చే ధైర్యం సీఎంకు ఉందా? వస్తే మీ అబద్దపు మాటలను నిరూపిస్తాం. నెల రోజులుగా ధాన్యం రాశులతో రైతులు పడుతున్న కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపిస్తాం’ అని అన్నారు. మంగళవారం మహేశ్వర్‌రెడ్డి యాదాద్రి జిల్లా భువనగిరి, ఆలేరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు జనగామ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు.
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్క యశస్వి
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్క యశస్వి నియమితులయ్యారు. మొత్తం 33 మందితో బీజేవైఎం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఆరుగురు ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శులు కూడా ఈ కమిటీలో ఉన్నారు.